ETV Bharat / opinion

నేపాల్‌ ప్రధాని ఓలీ 'ఓటి' రామాయణం - Oli comments on sri rama

శ్రీరాముడు మనవాడే అని త్రేతాయుగం నుంచి కొలుచుకుంటూ తరిస్తుంటే, కాదు రాముడు తమవాడని నేపాల్​ ప్రధాని ఓలీ కొత్త గోల మొదలుపెట్టాడు. ప్రకోప ప్రచారాలతో కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే తతంగానికి ఉద్దేశపూర్వకంగానే తెరతీశాడు. చైనాతో చేరి చెడిపోతున్నాడని విమర్శలు వస్తున్నా వినిపించుకోకుండా చెలరేగిపోతున్నాడు.

Nepal priminister KP Sharma Oli
నేపాల్‌ ప్రధాని ఓలీ 'ఓటి' రామాయణం
author img

By

Published : Jul 20, 2020, 8:30 AM IST

నీలమేఘశ్యాముడు మనవాడే అని త్రేతాయుగం నుంచి నిరంతరం తనివితీరా కొలుచుకుంటూ తరిస్తుంటే, కాదు రాముడు తమవాడని నేపాల్‌ ప్రధాని ఓలీ కొత్త గోల మొదలుపెట్టాడు. కాలాపానీ సహా ప్రస్తుతం మనదేశంలో ఉన్న ఇంకో రెండు ప్రాంతాలు తమవేనని ఈమధ్యే కొట్లాటకు దిగి కొంత చేతులు కాల్చుకున్నా పట్టువిడవకుండా బెట్టు సాగిస్తున్నాడు. చైనాతో చేరి చెడిపోతున్నాడని విమర్శలు వస్తున్నా వినిపించుకోకుండా చెలరేగిపోతున్నాడు. కరోనా సమస్యలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అసలు అయోధ్య తమదేనంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. వేల సంవత్సరాల హిందూ సంస్కృతిని డ్రాగన్‌ నోటికి ఎరగా వేస్తున్నాడు.

ఉద్దేశపూర్వకంగానే..

ప్రకోప ప్రచారాలతో కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే తతంగానికి నేపాల్‌ ప్రధాని ఉద్దేశపూర్వకంగానే తెరతీశాడు. తన పాలనలో పొరపాట్లపై తలెత్తిన గొడవల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నాడు. ఇలాంటి వివాదాలను కావాలనే ఓలీ రేకెత్తిస్తున్నాడని ప్రత్యర్థి వర్గమూ ఆయన ధోరణిని ఎండగడుతోంది. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నేత ప్రచండ చేస్తున్న బహిరంగ విమర్శలు, రాజకీయం వెనక భారత్‌ హస్తం ఉందనే అనుమానంతోనే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలకు తెగబడుతున్నాడన్నది జగమెరిగిన సత్యం. అసలు అప్పటి ఆర్యావర్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే నేపాల్‌ అనేదే లేదని, అది భారత్‌లో భాగమని ఇంకొందరు గుర్తుచేస్తున్నారు. మరోవైపు భౌగోళిక వివాదంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నదే తమ ప్రధాని ఉద్దేశమంటూ నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రేగిన గాయానికి మందుపూసే పని మొదలుపెట్టింది.

ఓలి తర్కం అదే అయితే..

రాముడి అత్తగారిల్లు ఉన్న జనకపురి నేపాల్‌లోనే ఉందన్న అంశంపై ఎవరికీ పేచీ ఉన్నట్లు లేదు. బీర్‌గంజ్‌ పక్కన ఉన్న అయోధ్యకే జనకపురి దగ్గరగా ఉంది కాబట్టి అదే అసలు అయోధ్య... అక్కడెక్కడో ఉత్తర్‌ ప్రదేశ్‌ అయోధ్య నుంచి రాముడు వచ్చే అవకాశమే లేదనేది ఓలి తర్కం కాబోలు. ఇక జటాయువు మన భద్రాచలం అడవుల్లోనే ఉండేవాడంటే ఇంకేమంటాడో? ఇప్పుడు ఓలీపై చాలా బాధ్యతలు పడ్డాయి. లంక ఎక్కడుందో, రావణాసురుడు ఎక్కడివాడో కూడా తేల్చాలి. రాముడినే అంటిపెట్టుకొని ఉన్న హనుమంతుడికీ ఒక ఊరు చూపించాలి. వానర సైన్యం చిరునామాలు చెప్పాలి. రామకీర్తనలన్నీ నేపాలీ భాషలోనే జరిగేవని నిరూపించాలి. లవకుశుల వారసత్వం నేపాల్‌ నేలపైనే ఉందని వెల్లడించాలి.

చైనా చేతిలో బొమ్మ

తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి హస్తినలో కుట్రలు జరుగుతున్నాయని తరచూ తప్పుడు ఆరోపణలతో జనాన్ని మభ్యపెట్టే ఓలీ వాస్తవానికి చైనా చేతిలో చెత్త బొమ్మ అని అందరికీ తెలిసిందే. కొన్ని ప్రైవేటు భారతీయ చానళ్లను ఆయన ఇటీవల నిషేధించాడు. కరోనాను కట్టడి చేయడంలో విఫలమై, ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోడానికి ఆ వ్యాధి ఇండియా నుంచే నేపాల్‌కు చేరుతోందనే చౌకబారు ప్రచారానికి పూనుకొన్నాడు.

ఎన్నో వాదనలు..

నిజానికి అయోధ్యపై అనేక వివాదాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. వాల్మీకి విరచిత రామాయణంలో రాముడి పుట్టుక వివరాలు ఆధునిక ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యతో చాలావరకు సరిపోతున్నాయని ఈ భూమ్మీద సింహభాగం జనం నమ్ముతున్నారు. అయినా ఎప్పటి నుంచో ఎంతోమంది ఎన్నో రకాల వాదాలను వెలికి తీసుకొస్తున్నారు. దేనికీ సరైన ఆధారాలు దొరకట్లేదు. రామజన్మభూమి వివాదంలో మూడు దశాబ్దాల క్రితం అయోధ్యపై విభేదాలు తీవ్రమయ్యాయి. నాటి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. అన్నివర్గాలు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి ఆఖరికి ఈ మధ్యనే మన అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అప్పట్లో బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీలోని కొందరు చరిత్రకారులు రాముడు ఈ అయోధ్యలోనే పుట్టలేదనే వాదనతో ముందుకు రావడం కలకలం రేపింది. తరవాత మరొకాయన అఫ్గానిస్థాన్‌లోని నేటి హీరాత్‌ నగరమే నాటి అయోధ్య అని తీర్మానించాడు. ఇంకొకాయన సింధు నాగరికతపై పరిశోధన చేస్తూ హరియాణాలోని నాటి సరస్వతీ నదీతీరంలో ఉన్న బన్వాలీనే అయోధ్య అన్నాడు. రామరాజ్యం సింధులోయ నుంచి సుమేర్‌ అంటే నేటి ఇరాక్‌ వరకు విస్తరించిందంటాడు. అంతేకాకుండా అప్పటి బాబిలోన్‌ రాజు హమురబినే రామాయణంలోని రావణుడని వక్కాణించాడు. ఈమధ్య మరో నాయకుడు తన ప్రచురణలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఒక ప్రాంతంలో రాముడు పుట్టాడని చెప్పుకొచ్చాడు. కానీ మంగోలియా, థాయ్‌లాండ్‌, ఇండొనేషియా ప్రాంతాల్లోని జానపద సాహిత్యంలో మాత్రం రాముడు భారత భూభాగంలో జన్మించాడనే ప్రచారం ఇప్పటికీ ఉంది.

సద్బుద్ధిని ప్రసాదించాలని..

మన దేశంలో రామాలయం లేని గ్రామం, సీతమ్మ బావిలేని ఊరు, అర్జునుడు తపస్సు చేయని గుట్ట ఉండవంటే అతిశయోక్తి కాదు. అందుకే పాతాళభైరవి సినిమాలోని నేపాళీ మాంత్రికుడు ఓలీ నేలపై వాడంటే ఒప్పుకొంటారేమో కాని- తోటరాముడు సహా సీతారాముడు తమవాడే అని మన వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఎవరో వ్యాఖ్యానించినట్లు అయోధ్య ఒక్కటే భారతదేశానిది. అరవింద దళాక్షుడైన రాముడు ఈ చరాచర జగత్తులో అందరివాడు, అన్ని జీవులవాడు. అది తెలుసుకొని వివాదాలను, విపరీత చేష్టలను విడిచిపెట్టి మంచిగా పాలన చేసుకునే సద్బుద్ధిని డింగరి ఓలీకి ఆ పరంధాముడు ప్రసాదించాలని భక్తులు కోరుకుంటున్నారు!

- ఎమ్మెస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.