ETV Bharat / opinion

అవి రక్షణ కాదు... భక్షణ కేంద్రాలు! - బాలికా సంరక్షణ కేంద్రాల్లో రావాల్సిన మార్పులు

బిహార్ ముజఫర్​పుర్​లోని సంరక్షణ కేంద్రంలో బాలికలపై రెండేళ్ల క్రితం జరిగిన లైంగిక దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిన చేతులే అణిచేస్తుంటే సంరక్షణ కేంద్రాల్లో అభాగినులకు భద్రత ఎక్కడుందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించడంతో వ్యవస్థాగత అలసత్వం బయటపడింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎన్‌సీపీసీఆర్‌) నివేదికల ప్రకారం.. రాష్ట్రాల్లో శరణాలయాల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని తేలింది. విదేశీ తరహా చట్టాలను దేశంలో అమలు చేస్తేనే.. శరణాలయాల స్థితిగతుల్లో మార్పు వస్తుంది.

NEED TO CHANGE THE RULES OF MAINTAINING IN GIRLS CARE CENTERS
రక్షణ కాదు... భక్షణ కేంద్రాలు!
author img

By

Published : Nov 19, 2020, 7:36 AM IST

సుమారు రెండేళ్ల క్రితం బిహార్‌లోని ముజఫర్పుర్ పేరు దేశమంతటా మార్మోగిపోయింది. అప్పట్లో అక్కడి సంరక్షణ కేంద్రంలోని 34మంది బాలికలపై నెలల తరబడి అమానుష లైంగిక దాడులు జరిగాయన్న కథనాలు దిగ్భ్రాంతపరచాయి. బిహార్‌లోని మరో 15 సంరక్షణ కేంద్రాల్లో అంతకన్నా హృదయ విదారక స్థితిగతులు నెలకొన్నాయన్న టిస్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌) వాంగ్మూలం, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దేవ్‌రియా శరణాలయంలో వెలుగు చూసిన వ్యభిచార రాకెట్‌ తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. ఆదుకోవాల్సిన చేతులే అణిచేస్తుంటే సంరక్షణ కేంద్రాల్లో అభాగినులకు భద్రత ఎక్కడుందన్న సర్వోన్నత న్యాయస్థానం సూటిప్రశ్న వ్యవస్థాగత అలసత్వాన్ని నిగ్గదీసింది. ఆ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) క్రోడీకరించిన నివేదిక ప్రకారం- రాష్ట్రాలవారీగా శరణాలయాల పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదు!

స్వచ్ఛంద సంస్థల్లోనూ..

ఆశ్రయం కోరి వచ్చిన వారిపై భౌతిక, లైంగిక దాడుల్ని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు లేని సంరక్షణ కేంద్రాల సంఖ్య త్రిపుర(86.8శాతం)లో అత్యధికమని ఎన్‌సీపీసీఆర్‌ నిగ్గుతేల్చింది. కర్ణాటక(74.2), ఒడిశా(68), కేరళ(63.4), అసోం(60.9) తరవాతి నాలుగు స్థానాల్లో నిలిచాయి. విదేశీ విరాళాలతో నడిచే స్వచ్ఛంద సంస్థల్లో అనాథల సంరక్షణ మెరుగ్గా సాగుతుందన్న ఆశా వట్టి అడియాసేనని గణాంక విశ్లేషణ చాటుతోంది. ఆంధ్రప్రదేశ్​లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని 145 షెల్టర్‌ హోమ్స్​లోని దాదాపు 6,200మంది పిల్లలకోసం ఏడాది వ్యవధిలో రూ.400కోట్లకుపైగా విదేశీ విరాళాలు సమకూరాయి. అంటే సగటున తలసరి రూ.6.6.లక్షలు. తెలంగాణ (రూ.3.88లక్షలు), కేరళ కర్ణాటక తమిళనాడులలో (రెండు లక్షల రూపాయలకు పైబడి) వెలుపలినుంచి సాయం అందుతున్నా- తగినంత మంది సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల పరికల్పన దాఖలాలు లేకపోవడం- నిధులు దారి మళ్లుతున్నాయనడానికి ప్రబల సంకేతం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేనప్పుడే ముజఫర్పుర్​‌ తరహా బాగోతాలు చోటుచేసుకుంటాయని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ లోగడ అంగీకరించారు. నేడు దేశంలో అటువంటి ముజఫర్పుర్​లు మరెన్నో!

సుప్రీంకోర్టు చెప్పినా..

ఈ గడ్డపై కన్ను తెరిచిన బాలబాలికలు ఎటువంటి దుర్విచక్షణకూ గురికారాదని, లైంగిక భౌతిక హింస పాలబడరాదన్నది భారత రాజ్యాంగంలోని 19, 34 అధికరణల మౌలిక స్ఫూర్తి. దానికి గొడుగుపడుతూ- బాలల సంరక్షణకై నిర్వహిస్తున్న సంస్థలన్నీ నిర్దిష్ట నిబంధనావళి మేరకు రిజిస్టర్‌ కావాలని, నిర్ణీత కాలావధిలో తనిఖీలు సామాజిక ఆడిట్లు జరగాలని 2017 మే నెలలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించినా- ఏం ఒరిగింది? ఆ ఏడాది డిసెంబరు ఒకటో తేదీలోగా బాల న్యాయ (జువెనైల్‌ జస్టిస్‌) చట్టంకింద దేశంలోని ప్రతి సంరక్షణ కేంద్రమూ నమోదై తీరాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గడువు విధించింది.

ఎన్‌సీపీసీఆర్ ప్రకారం..

ఇప్పటికీ మహారాష్ట్ర (88.9శాతం), త్రిపుర (52.6), దిల్లీ (46.8), కేరళ(41.6), తెలంగాణ(40.1) వంటి చోట్ల ఆ నిబంధనను తుంగలో తొక్కుతున్నట్లు ఎన్‌సీపీసీఆర్‌ అధ్యయనం స్పష్టీకరిస్తోంది. నిబంధనల ప్రకారం వసతి గృహాల్ని జిల్లా సంక్షేమ, శిశు సంరక్షక కమిటీలు తనిఖీ చేయగల వీలున్నా- అదృశ్య రాజకీయ హస్తాలు ఎవర్నీ లోపలికి అడుగు పెట్టనివ్వని దురవస్థ తరతమ భేదాలతో అంతటా ప్రస్ఫుటమవుతోంది. ఇటీవల తెలంగాణలోని అమీనాపూర్‌ తరహా ఘటనలు- నిర్వాహకులు, అధికారులు, స్థానిక పెత్తందారుల మధ్య పెనవడిన అనైతిక బంధానికి దృష్టాంతాలుగా ఛీ కొట్టించుకుంటున్నాయి. పిల్లలపై ఎటువంటి నేరాలకైనా నార్వే ప్రభృత దేశాలు కఠిన శిక్షలు అమలుపరుస్తున్నాయి. కచ్చితమైన విధినిషేధాలతో అమెరికా, ఇంగ్లాండ్‌ వంటివి బాలల సంరక్షణకు విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. అదే బాణీలో దేశీయంగానూ చట్టాల అమలు రాటుతేలి శరణాలయాల్లో స్థితిగతులు తేటపడితేనే, చిత్రహింసల బారినుంచి నిస్సహాయ బాలలు గట్టెక్కగలిగేది!

ఇదీ చదవండి: భారత్​కు జో బైడెన్​ కొత్తేమీ కాదు: జైశంకర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.