కొవిడ్ సంక్షోభం ధాటికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) తీవ్రంగా సతమతమవుతున్నాయి. మొదటి దశలో ఎదురుదెబ్బల నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో రెండోదశ పిడుగుపాటులా మారింది. దీనికితోడు, మూడో దశపై హెచ్చరికలు వినపడుతుండటంతో ఆందోళన, అభద్రతాభావం పెరుగుతున్నాయి. వ్యవసాయం తరవాత తక్కువ మూలధన వ్యయంతో 11 కోట్ల మందికి ఉద్యోగాలు అందిస్తోంది ఈ రంగమే. 2015-16 జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో 6.33 కోట్లకుపైగా ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనివే. ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం. కొవిడ్‌తో డీలాపడిన ఎంఎస్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకం.
రుణాలు తిరిగి చెల్లించలేని స్థితిలో..
లాక్‌డౌన్ల కారణంగా చిన్న పరిశ్రమలు సమస్యల ఊబిలో చిక్కుకున్నాయి. ముడిసరకు ధరలు పెరిగిపోవడం, సిబ్బంది కొరత, వస్తు సేవలకు గిరాకీ లేకపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. అదే సమయంలో వ్యాపారం పూర్తిస్థాయిలో కొనసాగకపోతుండటంతో ఉత్పత్తులకు ధరలు పెంచక తప్పడం లేదు. ఇలాంటి పరిణామాలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. సాధారణంగా 45 రోజుల్లోగా ఎంఎస్‌ఎంఈల బకాయిలను తీర్చాల్సి ఉండగా- భారీ, మధ్య తరహా సంస్థల చెల్లింపుల్లో జాప్యం నెలకొనడం ఈ రంగాన్ని ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా చిన్న సంస్థలు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేని దుర్భర స్థితికి చేరుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం చిన్న సంస్థలదాకా చేరడం కష్టమవుతోంది. మే నెలలో 171 జిల్లాల్లోని ఆరు వేల సంస్థలపై 'లోకల్ సర్కిల్స్' అనే సామాజిక మాధ్యమ వేదిక సర్వే నిర్వహించగా- వచ్చే ఆరు నెలల్లో అరవై శాతం సంస్థలు వ్యాపారాన్ని మూసివేయాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తేలింది. 63 శాతం సంస్థలకు కేవలం మూడు నెలలకు సరిపడా ఆర్థిక వనరులు మాత్రమే ఉన్నాయి.
పలు సంస్థలు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించలేక పోతుండగా, ఆర్థికంగా కుదేలైన వాటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం జంకుతున్నాయి. దీంతో తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఆధార పడుతున్నా, ద్రవ్యలోటుతో ఆ సంస్థలూ గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీపై వాణిజ్య సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆ ప్యాకేజీ సరిపోదని తేల్చిచెప్పాయి. సమస్య మూలాలను విస్మరిస్తే, పరిష్కారంగా అమలు చేసే విధానాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజీయే నిదర్శనం. తాము ప్రకటించిన ప్యాకేజీ జీడీపీలో 10.3 శాతమని కేంద్రం ప్రకటించినా, ప్రత్యేక ఆర్థిక ఉద్దీపన జీడీపీలో 1.3 శాతం కన్నా తక్కువకే పరిమితమైంది. బ్యాంకులు సైతం ఎంఎస్‌ఎంఈలు, రైతులకు ఆశించిన మేరకు రుణాలు ఇవ్వలేదని, 2020 మార్చి నుంచి పడిపోతున్న క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తిని చూస్తేనే అర్థమవుతోంది.
తక్షణ చర్యలు ఆవశ్యకం
ఎంఎస్‌ఎంఈ రంగం మూతపడితే సరఫరా గొలుసు, ఉద్యోగులు, కార్మికుల జీవనాధారంపైనే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలి. మూలధనం కొరతతో విలవిల్లాడుతున్న ఎంఎస్‌ఎంఈల కోసం 2021-22 బడ్జెట్‌లో కేటాయించిన రూ.15,700 కోట్లను సక్రమంగా వినియోగించాలి. ఇందుకు భారత ఎంఎస్‌ఎంఈ సమాఖ్య సహాయం తీసుకోవాలి. క్షేత్రస్థాయి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాలావధి రుణాల మంజూరుతో పాటు ప్రస్తుత రుణాలపై విచక్షణతో వ్యవహరించే అధికారం అన్ని స్థాయుల్లోని బ్యాంకు మేనేజర్లకు ఇవ్వాలి.
కేంద్రప్రభుత్వం, బడా ప్రైవేటు సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈలకు అయిదు లక్షల కోట్ల రూపాయల మేర బకాయిలు అందాల్సి ఉందని ఓ అధ్యయనం పేర్కొంది. బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, ప్రైవేటు సంస్థల విషయంలో చిక్కులు ఎదురవుతున్నాయి. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలి. జీఎస్‌టీ రీఫండ్ ప్రక్రియలోనూ వేగం పెరగాలి. ప్రభుత్వం తరఫున- లాక్‌డౌన్, ఆ తరవాత మూడు నెలల కాలానికి వేతన హామీతో కూడిన పథకాన్ని తీసుకొస్తే కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. పన్నులు, లైసెన్సు రుసుము, విద్యుత్తు బిల్లుల వసూళ్ల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ, కొంత ఉపశమనం కల్పించాలి. చిన్న దుకాణదారులు, వీధి వర్తకులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.
రచయిత- డాక్టర్ ఎన్.వి.ఆర్.జ్యోతికుమార్, (మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి)