ETV Bharat / opinion

మాదక మాఫియా... ఇంతలంతలు! - INDIAN PENAL CODE NEED TO CURB THE DRUG MAFIA WITH QUICK TRAILS AND STRICT PUNISHMENTS

దేశంలో నిశ్శబ్దంగా ఆశలు, ఆకాంక్షల గొంతుకోసి జాతి భవితను నీరుగార్చేవి మాదకద్రవ్యాలు. వినాశ తీవ్రతలో టెర్రరిజానికి ఏమాత్రం తీసిపోదీ మత్తు రక్కసి. తన సహస్ర బాహువులతో అంతకంతకూ వ్యాపిస్తూ తన ఉనికిని చాటుతూ.. కొత్తగా కన్నడ సినీ పరిశ్రమలో తుపాను కలకలం సృష్టిస్తోంది. విదేశాల్లో ఈ వ్యాపారానికి తెగబడిన వారిపై మరణదండన విధిస్తున్నప్పుడు.. భారత శిక్షాస్మృతి మాత్రం ఎందుకు ఉపేక్షించాలి? నిఘా వ్యవస్థను మరింత పెంచి సత్వర విచారణ చేపట్టడం సహా.. కఠిన దండనలతో ఈ మాఫియాను అరికట్టాలి. అలా చేస్తేనే డ్రగ్స్​ నుంచి యువత బయటపడే అవకాశముంది.

INDIA NEED TO CURB THE DRUG MAFIA
మాదక మాఫియా... ఇంతలంతలు!
author img

By

Published : Sep 6, 2020, 9:06 AM IST

ఉగ్రవాదం- బాంబులూ తుపాకులతో రక్తపుటేళ్లు పారించి ప్రత్యక్ష మారణహోమానికి కారణభూతమవుతుంది. అదే మాదకద్రవ్యాలైతే- నిశ్శబ్దంగా ఆశలూ ఆకాంక్షల పీక నులిమి జాతి భవితను కుళ్లబొడుస్తాయి. వినాశ తీవ్రతలో టెర్రరిజానికి ఏమాత్రం తీసిపోని మత్తు రక్కసి తన సహస్ర బాహువులతో మూలమూలలకూ చొచ్చుకుపోతూ ఎక్కడికక్కడ స్వీయ ఉనికిని చాటుతోంది. ఆ క్రమంలోనే తాజాగా కన్నడ చిత్రసీమలో డ్రగ్స్‌ తుపాను పెనుకల్లోలం రేపుతోంది. మీరే పరికించండి...

అతగాడి పేరు రవిశంకర్‌. రవాణాశాఖలో ఓ ఉద్యోగి. పదిరోజులక్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని రాబట్టిన సమాచారం ప్రకారం, అతడు కన్నడ నటి రాగిణీ ద్వివేదితో నాలుగేళ్లుగా 'సహజీవనం' చేస్తున్నాడు. నెలకు రూ.38వేల జీతం పొందే ఆ చిరుద్యోగి తనతో అనుబంధం కొనసాగిస్తున్నందుకు ఆ నటికి లక్ష రూపాయల వంతున చెల్లించేవాడినని చెప్పేసరికి- పోలీసులు కంగుతిన్నారు. రాగిణిని అయిదు గంటలపాటు విచారించేసరికి చాలా విషయాలు బయటపడ్డాయి. తీగ లాగితే డొంకంతా కదిలిన చందంగా, తెరవేలుపుల మాదక ద్రవ్యాల అక్రమ వ్యవహారాలు వెలుపలికి పొక్కి, కన్నడ చిత్రసీమలో పలువురి పేర్ల చుట్టూ ఇప్పుడు అనుమానాలెన్నో దట్టంగా కమ్ముకుంటున్నాయి.

బెంగళూరు వ్యాప్తంగా..

చిత్రనగరితోపాటు దాదాపు బెంగళూరు అంతటా, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనూ డ్రగ్స్‌ వినియోగం చిలవలు పలవలు వేసుకుపోయిందన్న ఆరోపణలపై కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై విస్తృత సమీక్షకు ఆదేశించడం సరికొత్త పరిణామం. సుమారు డజనుమంది నటీనటులకు మాదక మాఫియాతో లింకులున్నట్లు కన్నడ నిర్మాత ఇంద్రజిత్‌ లంకేశ్‌ చేసిన ఆరోపణలతో మొదలైన నేరపరిశోధన కడకు ఎటు దారి తీస్తుందో అంతుచిక్కడం లేదు. ‘ఇది ఆరంభం మాత్రమే... ఈ కేసులో మున్ముందు ఎందరెందరో విచారణ ఎదుర్కొంటారు...’ అని బెంగళూరు నగర కమిషనర్‌ కమల్‌ పంత్‌ చెబుతున్నా- ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించగలరు?

వెండితెరపై ఆగని మత్తుమరకలు..

వెండితెరపై మత్తుమరకలు పడటం గతంలోనూ చూశాం. ఆ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో సరికొత్తది, బాలీవుడ్‌ ఉదంతం. క్రికెట్‌ కథానాయకుడు మహేంద్రసింగ్‌ ధోనీ నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమాలో ప్రధానపాత్ర పోషించి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న యువనటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మొన్నీమధ్య ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. సుశాంత్‌తో సన్నిహితంగా మెలగి వివాదాస్పద ప్రవర్తనపై విచారణ ఎదుర్కొంటున్న రియా చక్రబర్తి సోదరుణ్ని, దివంగత నటుడి సిబ్బందిలో ఒకర్ని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి వారిద్దరూ ఒక డ్రగ్‌ సరఫరాదారునుంచి కనీసం 10-12సార్లు గంజాయి కొనుగోలు చేశారన్న ఆరోపణలు, సుశాంత్‌ ఆత్మహత్య కేసు విచారణను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.

ప్రస్తుతం కన్నడ చిత్రసీమలాగే సుమారు మూడేళ్లక్రితం తెలుగు సినీరంగమూ మత్తు దుమారంలో చిక్కి పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పట్లో కెల్విన్‌ ముఠా సభ్యుల విచారణలో భాగంగా వెలికివచ్చిన పేర్ల ప్రాతిపదికన కొంతమంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. నటీనటులు, ఫైట్‌మాస్టర్లు, దర్శకనిర్మాతల పేర్లూ ఆ జాబితాలో చోటు చేసుకున్నాయన్న వార్తాకథనాలు గగ్గోలు పుట్టించాయి. ఆ కేసు తరహాలోనే ఇప్పటి కన్నడ ప్రహసనం సైతం క్రమేపీ సద్దుమణుగుతుందో, సంబంధీకులకు చుక్కలు చూపుతుందో మరి!

యువతపైనే అధికంగా..

వివిధ రంగాల్లో సుప్రసిద్ధులు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందినవారిపై మత్తువలల ప్రభావం యువతపై అధికంగా ప్రసరిస్తుండటం అత్యంత బాధాకరమైన అంశం. వెండితెర వెలుగు జిలుగులు యువతీ యువకులెందరి కళ్లకో మిరుమిట్లు గొలుపుతున్నట్లే- దుర్వ్యసనాల భల్లూకం పట్టు వ్యక్తి హననానికి బాటలు పరుస్తున్నాయి. 2009 సంవత్సరంతో పోలిస్తే 30శాతం అధికంగా రమారమి 27కోట్ల మంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని, అందులో కౌమారప్రాయంలోనివారూ యువకులదే అతిపెద్ద వాటాగా ప్రపంచ మాదకద్రవ్య నివేదిక ధ్రువీకరిస్తోంది. దేశవ్యాప్తంగా మత్తు బారినపడిన వ్యసనపరుల్లో 80శాతం 35ఏళ్లలోపు వారేనన్న గణాంకాలు, అత్యవసర దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ఎలుగెత్తుతున్నాయి.

పటిష్ట నిఘా లేకనే..

పది పన్నెండేళ్ల క్రితం వరకు రసాయనాల పూత పూసిన మాత్రలు, చూర్ణం, ద్రవాల రూపంలో దాదాపు పాతిక రకాల సింథటిక్‌ డ్రగ్స్‌ చాటుమాటుగా విక్రయిస్తుండేవారు. ఇప్పుడు వాటి సంఖ్య ఎకాయెకి ఏడు వందలకు ఎగబాకిందన్న ఐరాస మాదకద్రవ్యాలూ నేరాల నియంత్రణ కార్యాలయం మదింపు చాటుతున్నదేమిటి? నిఘా నిర్లజ్జగా నిద్రపోతోంది, యువత భవిత దారుణంగా కొల్లబోతోంది! పంజాబ్‌, మహారాష్ట్రల్లాంటిచోట్ల కృత్రిమ మాదకద్రవ్యాల వాడకం పెచ్చరిల్లుతుండగా- వివిధ రాష్ట్రాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, పరిసర ప్రాంతాల్లో గంజాయి తదితరాల విక్రయాలు జోరెత్తుతున్నాయి. దేశంలో వేర్వేరు నగరాలనుంచి కథ నడిపిస్తున్న స్మగ్లర్లెందరికో హైదరాబాదుతో లింకులున్నట్లు లోగడే వెల్లడైంది.

ఆన్​లైన్​లోనూ కొనుగోళ్లు..

ఆన్‌లైన్‌ కొనుగోళ్లూ ఊపందుకుని, ఫ్యాషన్ల అనుకరణతోపాటు మత్తుకూ బానిసలవుతున్న పర్యవసానంగా- అసంఖ్యాకుల ఆరోగ్యానికి భవిష్యత్తుకు నిలువునా తూట్లు పడుతున్నాయి. కొన్నిచోట్ల బడిపిల్లల నాలుకపై మచ్చుకొక చుక్కవేసి మత్తురుచి చూపించి ఆ పసికందుల్నీ ఖాతాదారులుగా మార్చేసుకుంటున్నవాళ్లు నరరూప రాక్షసులు కాక మరేమిటి? ఒక్క పంజాబ్‌లోనే 70శాతానికిపైగా యువత మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు ఆ రాష్ట్రప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానానికి అధికారికంగా నివేదించడం, అంతకంతకు చేజారుతున్న పరిస్థితికి దర్పణం పట్టేదే. ఎనిమిది నెలల క్రితం దేశ రాజధానిలో రూ.1,300 కోట్లు, ఇటీవలే ముంబైలో వెయ్యి కోట్లు, భాగ్యనగరంలో వంద కోట్ల రూపాయల సరకు పట్టుబడటం- నార్కోటిక్స్‌ సామ్రాజ్య విస్తృతిని కళ్లకు కట్టేదే!

జీవచ్ఛవాలుగా మారుస్తోన్న మత్తు మాఫియా..

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివి, దిగ్గజ కొలువుల్లో చేరి ప్రతిభ నిరూపించుకుని, సొంతంగా వ్యాపార రంగానా అడుగిడిన ఓ యువకుడు మత్తుకు బానిసై అధఃపాతాళానికి దిగజారిన ఉదంతం మూడేళ్లక్రితం వెలుగు చూసింది. మత్తు ముఠా చేతుల్లో ఇరుక్కున్న ఆ యువకుడు 'నాసా'లో శాస్త్రవేత్తగా పనిచేశాడని తెలిసి అధికారగణం నివ్వెరపోయింది. సక్రమంగా విద్యాబుద్ధులు నేర్చి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన కోట్లమందిని మత్తు మాఫియా జీవచ్ఛవాలుగా మార్చేస్తోంది.

ఎందుకు ఉపేక్షించాలి?

సింగపూర్‌, థాయ్‌లాండ్‌, కాంబోడియా, వియత్నాం వంటిచోట్ల మాదకద్రవ్యాలు వినియోగించినా, ఉత్పత్తి చేసినా, నిల్వకు, వ్యాపారానికి తెగబడినా... మరణదండన విధిస్తున్నారు. కోట్లమందిని జీవచ్ఛవాలుగా మిగిల్చి కర్కశంగా కాసుల పంట పండించుకుంటున్న కిరాతక దందాసురుల్ని భారతీయ శిక్షాస్మృతి ఎందుకు ఉపేక్షించాలి? కొన్నేళ్ల జైలు, నామమాత్రం జరిమానాలు, అరకొర నిఘా, రుజాగ్రస్త నేరన్యాయ వ్యవస్థలతో మత్తుమాఫియాను అంగుళమైనా కదపలేరు. నిఘా తనిఖీ వ్యవస్థలను పరిపుష్టీకరించి, సత్వర విచారణ కఠిన దండనలతో మాదక మాఫియాను హడలెత్తించాలి. మత్తు బాధితులకు తగినన్ని పునరావాస కేంద్రాలూ నెలకొల్పాలి. పదునైన బహుముఖ కార్యాచరణతోనే డ్రగ్స్‌ ఉచ్చునుంచి యువత విముక్తమవుతుంది. ఏమంటారు?

- బాలు, రచయిత

ఇదీ చదవండి: సినీ పరిశ్రమతో డ్రగ్స్​ ముఠా లింకులపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.