ప్రాదేశిక భూభాగాలకు సంబంధించిన వివాదంలో భారత్, నేపాల్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన- భారీ జలాశయం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. డ్యాం నిర్మాణాన్ని సంక్షోభంలో పడేసింది. నేపాల్, మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం ద్వారా ప్రవహించే మహాకాళి నదిపై 5,600 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యంతో తలపెట్టిన భారీ నీటి ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మహాకాళి నది నేపాల్‌లో పుట్టి, ఉత్తరాఖండ్ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించి ఆగ్నేయ దిశగా మైదానాల ద్వారా ప్రవహిస్తూ గంగా ఉపనది ఘాఘ్రా నదితో సంగమిస్తుంది. భారత్, నేపాల్ దేశాల మధ్య ఈ నది సరిహద్దులా ఉంటుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా..
మహాకాళి నది సముద్ర మట్టానికి 11,800 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తూ కాలాపానీ ప్రాంతంలో తెరాయి మైదానాల్లోకి ప్రవేశించే చోట 660 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది జలవిద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనువైనది. 315 మీటర్ల ఎత్తుతో- 5,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా పేరొందే అవకాశం ఉంది. పంచేశ్వర్‌గా పిలిచే ఈ డ్యాం నిర్మాణంపై ఇరుదేశాలకు చెందిన అధికారులు 1956 నుంచి సంప్రదింపులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నది నీటి నుంచి జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంతోపాటు, ఇరుదేశాలకు సాగునీరు లభ్యమవుతుందనే ఉద్దేశంతో కేంద్ర జల సంఘం ఈ ప్రాజెక్టుకు మొగ్గు చూపుతోంది.
సాగునీరుకీ, వరదల నియంత్రణకూ..
ప్రతిపాదిత ఉపహిమాలయ జలవిద్యుత్ ప్రాజెక్టు కేవలం విద్యుత్తును మాత్రమే కాకుండా, భారత్‌లోని చాలా ప్రాంతాలకు, నేపాల్‌లోని వ్యవసాయ పొలాలకు సాగునీరు అందిస్తుంది. అంతేకాదు- బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరదలను నియంత్రించేందుకూ సహాయ పడుతుంది. డ్యాం నిర్మాణం ఏళ్ల కొద్దీ ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది.
భారత వ్యతిరేక వైఖరితో..
ఇరుదేశాలు 1996లో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు సంయుక్తంగా డ్యామ్‌ను నిర్మించాలనే అంగీకారానికి వచ్చాయి. 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన తరవాత కాఠ్‌మండూ పర్యటనలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇరుదేశాలూ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ డ్యామును 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత నేపాల్ ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరి కారణంగా ప్రాజెక్టు నిర్మాణం సందేహాస్పదంగా మారింది. నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ నేత, ప్రధానమంత్రి కేపీశర్మ ఓలి చైనా ప్రభావానికి లోనై భారత వ్యతిరేక వైఖరిని అందిపుచ్చుకొన్న క్రమంలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందనేది విశ్లేషకుల భావన. గత ఏడాది అక్టోబర్‌లో నేపాల్ పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భారీ స్వాగతం లభించింది. నేపాల్‌కు రవాణా, ఆర్థికపరమైన సహకారం అందించే పలు ఒప్పందాలపై అప్పట్లో జిన్‌పింగ్ సంతకాలు చేశారు.
నష్టాలూ ఉన్నాయంటూ..
జలాశయం నిర్మాణం వల్ల ఇరుదేశాలకు పలు ప్రయోజనాలతో పాటు నష్టాలు సైతం ఉన్నాయంటూ- దీని నిర్మాణంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నవారూ లేకపోలేదు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్, అల్మోడా, చంపావత్ వంటి మూడు జిల్లాల్లో- 123 గ్రామాల పరిధిలోని 30 వేల కుటుంబాల ప్రజలు నిరాశ్రయులవుతారనే ఆరోపణలున్నాయి. 9,100 హెక్టార్లలోని దట్టమైన అడవులు రిజర్వాయర్ పరిధిలో మునిగిపోతాయని చెబుతున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఆవరణ వ్యవస్థతోపాటు, వన్యజీవులకూ నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బాధిత ప్రజలు, పర్యావరణ ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ అంశంపై కొన్ని నెలలుగా సాగుతున్న బహిరంగ విచారణలు సైతం ఉద్యమకారులను శాంతింపజేయలేకపోయాయి.
కొత్త మలుపు తిరిగిన వివాదం..
ఉత్తరాఖండ్ క్రాంతిదళ్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీ, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ డ్యాం నిర్మాణాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. బాధిత ప్రజలకు సరైన రీతిలో పునరావాసం కల్పిస్తామని, తగినంత నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రభుత్వం ఎన్ని రకాల హామీలు ఇస్తున్నా- డ్యాం ప్రభావిత ప్రజలు పట్టువీడుతున్నట్లు కనిపించడం లేదు. ఫలితంగా ప్రతిపాదిత భారీ డ్యాం నిర్మాణంపై వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇరుదేశాల మధ్య వివాదాల అడ్డంకులను, దేశీయంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతలను అధిగమించినప్పుడే ఈ భారీ ప్రాజెక్టుకు మోక్షం లభించే అవకాశం ఉంది!
- ఆర్.పి.నైల్వాల్
ఇదీ చూడండి:ఆడబిడ్డల పట్ల దుర్విచక్షణ ఏనాటికైనా అంతమయ్యేనా..?