ETV Bharat / opinion

భారత్‌-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేనా? - ఈయూ

ఈయూ దేశాల కూటమి భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామి. ఈయూకు భారత్‌ తొమ్మిదో అతి పెద్ద భాగస్వామి. అయినప్పటికీ ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు భారత్​ 13ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ అంశం ఇప్పట్లో తేలేడట్టు కూడా కనిపించడం లేదు. ఇందుకు గల కారణాలేంటి? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్​కు లాభమేంటి?

EDITORIAL ON INDIA-EU FREE TRADE AGREEMENT
భారత్‌-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేనా?
author img

By

Published : Jul 23, 2020, 6:40 AM IST

భారత్‌- ఐరోపా సమాఖ్య (యూరోపియన్‌ యూనియన్‌- ఈయూ)ల నడుమ 13 ఏళ్లుగా నానుతున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) ప్రతిపాదనను సాకారం చేసుకునేందుకు ఉభయ పక్షాలూ ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఇది ఆశలు రేకెత్తిస్తున్న పరిణామమే అయినప్పటికీ, అంతిమ ఫలితం ఇప్పుడప్పుడే తేలేలా లేదన్నది నిర్వివాదం. ఈయూతో విస్తృత స్థాయి వర్తక పెట్టుబడుల ఒప్పందం (బీటీఐఏ) కుదుర్చుకోవడంపై నిలిచిపోయిన చర్చలను ఉభయ దేశాల వాణిజ్య మంత్రులు తిరిగి కొనసాగించడానికి భారత్‌-ఈయూ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది, ఇందుకు ఇదమిత్థమైన కాలవ్యవధిని ఏర్పరచలేదు. రానున్న కొద్ది మాసాల్లో సమావేశం కావాలని సదస్సులో అంగీకారం కుదిరింది. విస్తృత స్థాయి వర్తకం, పెట్టుబడుల ఒప్పందం (బ్రాడ్‌బేస్డ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అగ్రిమెంట్‌- బీటీఐఏ)పై 2007లోనే చర్చలకు నాంది పలికారు. అప్పటినుంచి పన్నెండు విడతలు చర్చలు జరిపిన అనంతరం 2013లో ఇవి నిలిచిపోయాయి.

ఎడతెగని ప్రతిష్టంభన

ఈయూ దేశాల కూటమి భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామి. ఈయూకు భారత్‌ తొమ్మిదో అతి పెద్ద భాగస్వామి. 2018-19లో ఐరోపా దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 11,500 కోట్ల డాలర్లు. ఇందులో ఎగుమతులు 5,700 కోట్ల డాలర్లు, దిగుమతులు 5,800 కోట్ల డాలర్లు. ఈయూ నుంచి అత్యధికంగా భారత్‌కు విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వస్తున్నాయి. 2000-2018 మధ్యకాలంలో ఐరోపా దేశాల నుంచి 9,100 కోట్ల డాలర్ల మూలధన పెట్టుబడులు తరలివచ్చాయి. 2017లో యూరప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ దిల్లీలో కార్యాలయం ప్రారంభించి భారత్‌లో అనేక ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది. ఇక ఈయూలో భారత్‌ మదుపులు సుమారు 5,000 కోట్ల యూరోలు ఉంటాయని అంచనా. అయినా రెండు పక్షాలూ తమ మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేకపోతున్నాయి. భారత్‌ 2015 డిసెంబరులో విదేశాలతో ద్వైపాక్షిక వర్తక ఒప్పందాలకు కొత్త నమూనా ప్రకటించి, అప్పటి పాత ద్వైపాక్షిక వర్తక ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఐరోపా దేశాల పెట్టుబడులకు ఇప్పుడు ప్రత్యేక రక్షణ ఏదీ లేదు. దీంతో 28 సభ్యదేశాలూ తమ పెట్టుబడుల రక్షణ కోసం సంప్రతింపులు జరిపే బాధ్యతను ఈయూకు అప్పగించాయి. ఇక 'బ్రెగ్జిట్' కూడా అనిశ్చితికి మరో కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాహనాలు, వాటి విడిభాగాలు, మద్యం, పాడి ఉత్పత్తులు, వాటితో పాటు డేటా సెక్యూరిటీ అంశం ఇండియా-ఈయూ బీటీఐఏకు అవరోధంగా నిలుస్తున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) అజయ్‌ సహాయ్‌ చెబుతున్నారు. ఎగుమతిదారుల సంఘంగా తాము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నామని స్పష్టీకరించారు. ఉభయ పక్షాలూ ఎంతమేరకు ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబిస్తాయనే దానిపై అంతా ఆధారపడి ఉంటుందన్నది సహాయ్‌ అభిప్రాయం. జేఎన్‌యూలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో ఐరోపా అధ్యయనాల కేంద్రం చైర్‌పర్సన్‌ గుర్షన్‌ సచ్‌దేవా ఉద్దేశం ప్రకారం, బ్రిటన్‌ భారత్‌కు ప్రధాన భాగస్వామి అయినందున, ఈయూ నుంచి ఆ దేశం వైదొలగుతున్న తరుణంలో ఈయూతో బీటీఐఏ కుదుర్చుకునే అంశాన్ని విడిగా పరిశీలనలోకి తీసుకోవలసి ఉంటుంది. బ్రిటన్‌ ఈయూతో కుదుర్చుకునే ఒప్పందం ఎలా ఉంటుందనేది కీలకం. ఐరోపాలోని కాందిశీకుల సమస్య, ఐరోపా ఆర్థిక వ్యవస్థ తీరూ విస్మరించలేని అంశాలు. జులై 15 సదస్సు తరవాత ఏర్పాటైన ఉన్నతస్థాయి సంప్రతింపుల వ్యవస్థ బాధ్యత- బీటీఐఏ సంప్రతింపుల పునఃప్రారంభ ప్రక్రియ గురించి చర్చలు జరపడమే. అంతేతప్ప ఒప్పందం కుదుర్చుకోవడం కాదు. కనుక సమీప భవిష్యత్తులో ఎఫ్‌టీఏ సాకారమయ్యే అవకాశం కనిపించడం లేదన్నది సచ్‌దేవా అభిప్రాయం.

స్వీయరక్షణ అవసరం

వియత్నాం ఈయూతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి ఆమోదం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఈయూ-వియత్నాం స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది. ఏషియాన్‌ (ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం) సభ్యదేశమైన సింగపూర్‌ మునుపే ఈ ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం, భారత్‌ రెండూ ఐరోపా విపణిలో పాదం మోపేందుకు ఎప్పటినుంచో పోటీ పడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రధాన ధ్యేయం- తయారీ రంగంలో దేశం స్వయంసమృద్ధం కావడం! ఇందుకోసం మన వ్యవసాయ పారిశ్రామిక వస్తువులకు విదేశీ చౌక దిగుమతుల నుంచి అధిక సుంకాల రూపంలో రక్షణ కల్పించడం అవసరం. మన వస్తూత్పత్తులను తమ విపణుల్లోకి స్వేచ్ఛగా అనుమతించాలంటే, ఈయూ దేశాలు తమకూ అదే అవకాశం కల్పించాలని కోరడం సహజం. కనుక 'భారత్‌లో తయారీ' ఉత్పత్తులు నాణ్యతలోను, ధరలోను విదేశీ వస్తువులతో పోటీపడగలగాలి. మన పరిశ్రమలను అలా తీర్చిదిద్దుకోవాలి. అవి అంతర్జాతీయ విపణిలో పోటీపడగలిగినప్పుడు మాత్రమే మనం పూర్తిస్థాయిలో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోగలిగిన స్థితిలో ఉంటాం!

- అరూనిమ్‌ భూయాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.