కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో లక్షల సంఖ్యలో కూలీలు- తాము పనిచేసే ప్రాంతాల నుంచి సొంతూళ్లకు పయనమవడంతో వారి కష్టాలు ప్రపంచానికి తెలిశాయి. వలస కూలీల భద్రతపై పలురకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తాజా 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో 'వలస కమిషన్'కు సంబంధించిన ఆలోచనల్ని పంచుకున్నారు. ప్రతిపాదిత కమిషన్ ద్వారా వలస కార్మికుల్లో నైపుణ్యాల్ని గుర్తించే దిశగా కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి కల్పించే అంశం గురించీ ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఆలోచన మెచ్చుకోదగినదే అయినా, మెరుగైన జీవనోపాధి కోసం దేశంలోని ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేలా పేద ప్రజలపై ఒత్తిడి పెంచుతున్న సవాళ్లకు సంబంధించి నిర్మాణాత్మక, సంస్థాగత పరిష్కారం దిశగా దృష్టి సారించడం మంచిది. సమగ్ర పట్టణీకరణ, స్వయంసమృద్ధ గ్రామాలకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చ అంతులేనిది.
ఏర్పాటు సంక్లిష్టం
'వలస కమిషన్'... కష్టాలు తీర్చేనా? వాస్తవిక పరిస్థితి ఏమిటంటే, ఒక రాష్ట్రం నుంచి బయటికి వలస సాగుతోందంటే- మొదటి కారణం, వ్యవసాయ సంక్షోభమే. చౌకలో లభించే కార్మిక శక్తి భారీస్థాయిలో ఉన్నా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు తగిన వాతావరణం లేని కారణంగానే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఈశాన్యంలోని కొన్ని రాష్ట్రాల అశక్తత కూడా బయటి వలసలకు కారణమవుతోంది. ఉపాధి వెదుక్కుంటూ వలస వెళ్లే ఇలాంటి కూలీలు సాధారణంగా దక్షిణ రాష్ట్రాలకుగాని, దేశంలోని పశ్చిమ ప్రాంతానికిగాని వెళ్తున్నారు. మిగతా దేశంతో పోలిస్తే, అక్కడ పారిశ్రామికీకరణ అధికంగా జరిగింది. లక్షల సంఖ్యలో ఉన్న ఇలాంటి వలస కార్మికులను సొంతూరికి తిరిగి వెళ్లేలా లాక్‌డౌన్ ఒత్తిడి పెంచింది. బహిరంగంగానే భారీ సవాళ్లు విసిరింది. ఈ క్రమంలో ప్రతిపాదిత వలస కమిషన్ ఏర్పాటు ప్రక్రియ సంక్లిష్టమే. అందుకని భవిష్యత్తులో ఏవైనా మంచి ఫలితాలు అందుకోవాలంటే ఇలాంటి సమస్యలు, సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది.
వ్యవసాయ పనుల్లో కూలీ, ఆదాయాలు తగ్గిపోయిన పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు తిరుగు వలసబాట పట్టిన క్రమంలో, ఈ సమస్యను పరిష్కరించడమే మొట్టమొదటి సవాలు. గ్రామాలకు పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తూ ఉండటంతో వ్యవసాయ రంగంలో కూలి పనుల కోసం పోటీ మరింత తీవ్రతరమవుతోంది. 2020 మే నెలకు సంబంధించిన వివరాల ప్రకారం... 3.44కోట్ల కుటుంబాలకు చెందిన 4.89 కోట్ల మంది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద పనులు కావాలంటూ కోరారు. గ్రామీణ భారతంలో జీవనోపాధిని సంపాదించడం ఎంత కష్టమో తెలిపేందుకు ఇది నిదర్శనం.
గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం రెండో పెద్ద సవాలు. ప్రధానమంత్రి వీటినే ప్రతిపాదించారు. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఇలాంటి ప్రాజెక్టులకు పెట్టుబడుల్ని ఆకర్షించడమే అతిపెద్ద సమస్య. ఇలాంటి అంశాల్ని మెరుగుపరిచేందుకు పలు ఉత్తరాది రాష్ట్రాలు కార్మిక చట్టాలకు సవరణలు చేపడుతున్నాయి. కానీ, అవి కార్మికుల ప్రయోజనాలకే భంగం కలిగించే అవకాశం ఉంది. రాష్ట్రాలకు పెట్టుబడుల ప్రవాహం జరగాలంటే- మంచి పాలన, మెరుగైన నియంత్రణ విధివిధానాలు, చక్కని వాణిజ్య వాతావరణం ఉండాలి. కార్మిక చట్టాల్లో సవరణలు చేపట్టడం ద్వారా కార్మికుల ప్రయోజనాలకే భంగం కలిగే పరిస్థితులు వాటిల్లితే పరిస్థితులు మరింతగా క్షీణిస్తాయి. మెరుగైన వేతనాల్ని అందించే రాష్ట్రాల దిశగా కార్మిక వలసలు కొనసాగే అవకాశం ఉంటుంది. కార్మికులను నిలువరించే విధానాలు చట్టపరంగానూ చెల్లబోవు.
మార్గాంతరం ఏమిటి?
వలస కార్మికులను ప్రభుత్వాలు అందించే సురక్షిత చట్రాల కిందకి తీసుకొచ్చే క్రమంలో- వారి కదలికలను గుర్తించడం మరో పెద్ద సమస్య. ఈ విషయంలో దశాబ్దాలుగా ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఆ పర్యవసానాలే- ప్రస్తుతం మన కళ్లెదుట కనిపిస్తున్న కార్మికుల కష్టాలు. వలస కార్మికులకు సంబంధించిన సమాచారం పెద్దగా లేకపోవడం వల్లే ఇలాంటి దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుత పథకాల అమలుకోసం, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పాలనను మెరుగుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస కూలీల కష్టాలకు కారణమవుతున్న వ్యవస్థల్ని సంస్థాగత, నిర్మాణాత్మక యంత్రాంగాలను పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. సాంకేతికపరమైన మార్పులు అవసరమే కానీ, వాటికి మానవీయ దృక్పథాన్నీ జోడించాలి. దృఢమైన సంకల్పం, సున్నిత హృదయంతో వ్యవహరించే వైఖరి మాత్రమే వలస కార్మికుల సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలవు. ఇలాంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా ఎలాంటి కమిషన్లను ఏర్పాటు చేసినా, పథకాల్ని ప్రారంభించినా- తగిన ప్రయోజనం ఉండదు.
- డాక్టర్ మహేంద్రబాబు కురువ
(రచయిత- హెచ్‌ఎన్‌బీ గఢ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ డీన్)
ఇదీ చూడండి: ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు