ప్రపంచంలోనే అత్యధిక విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన భారీ డ్యామ్‌ను ఏర్పాటు చేయాలనుకున్న చైనా మాస్టర్ ప్లాన్ ఆగిపోయింది. అస్థిరమైన ఓ కృత్రిమ సరస్సు 'నీటి బాంబు' రూపంలో చైనాకు అడ్డంకిగా మారింది.
ఏంటా ప్రాజెక్టు..
యార్లుంగ్ సాంగ్పో నదిపై రెండు మెగా డ్యామ్‌లను నిర్మించాలని చైనా కంకణం కట్టుకుంది. ఇవి పూర్తైతే ప్రపంచంలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే ఆనకట్టలుగా రికార్డుకెక్కుతాయి. వీటిని భారత సరిహద్దు సమీపంలో నిర్మిస్తోంది చైనా.
ఇదీ చదవండి- బ్రహ్మపుత్రపై చైనా భారీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్!
మనకేంటి ఇబ్బంది?
అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎగువన ప్రవహించే బ్రహ్మపుత్ర నదినే చైనీయులు యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో దీన్ని సియాంగ్ అని సంబోధిస్తారు. టిబెట్‌లో ఉద్భవించే ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్, అసోంల ద్వారా ప్రవహించి బంగ్లాదేశ్ చేరుతుంది. డ్యామ్ నిర్మాణం వల్ల బ్రహ్మపుత్రలోని నీటిని ప్రాజెక్టులోకి మళ్లించినట్లవుతుంది. దిగువకు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. కరవు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి- బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్‌కు లాభం!
ఈ ప్రాజెక్టులను రాజకీయ ఒత్తిడి అస్త్రంగా, యుద్ధాల్లో ప్రత్యర్థిపై ప్రయోగించే ఆయుధంగా ఉపయోగించాలన్నది చైనా పన్నాగం. లద్దాఖ్‌లో గల్వాన్ నదిపై చైనా సైన్యం అడ్డుకట్ట నిర్మించి ఘర్షణ పడిన సమయంలో అకస్మాత్తుగా నీటిని విడుదల చేసి భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉదంతమే దీనికి సాక్ష్యం. తాజాగా నిర్మించే డ్యామ్ విషయంలోనూ ఇది జరగొచ్చు. నీటిని కిందకు వదిలే సమయంలో సమీప ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది. ఇది అరుణాచల్‌ప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.
అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి మరీ చైనా ఈ నిర్మాణం చేపట్టింది. దిగువన ఉన్న దేశాల హక్కులను పరిగణలోకి తీసుకోకుండానే డ్యామ్‌లను నిర్మిస్తోంది. ఇండియా, బంగ్లాదేశ్ అభిప్రాయాలను పెడచెవిన పెట్టింది.
చైనాకు ఇప్పుడొచ్చిన సమస్య ఏంటి?
2017-18 సంవత్సరాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా ఇప్పుడు ఇక్కడో కృత్రిమ సరస్సు ఏర్పడింది. 600 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఇక్కడికి చేరింది. డ్యామ్ నిర్మించే ప్రాంతానికి ఎగువన ఉండే సెడోంగ్పు బేసిన్లో ఈ సరస్సు ఏర్పాటైంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయ ఉన్నది కూడా ఇక్కడే.
ఇదీ చదవండి- 'బ్రహ్మపుత్ర డ్యాంపై భారత్‌కు ఆందోళన అనవసరం'
ఇంతటి భారీ స్థాయిలో నీరు పేరుకుపోవడం డ్యామ్ పనులకు అడ్డంకిగా మారింది. నీటిని తొలగించి పనులు జరిగేలా చూసేందుకు చైనా ప్రభుత్వం ఇప్పటికే పలు బృందాలుగా శాస్త్రవేత్తలు, అధికారులను సెడోంగ్పు పరివాహక ప్రాంతానికి పంపించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయని, తక్షణ పరిష్కారాలేవీ లభించలేదని షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ షింగ్ షిగౌ తెలిపారు. ప్రభుత్వం పంపిన బృందంలో ఈయన సభ్యుడిగా ఉన్నారు.
సరస్సు వల్ల ప్రాజెక్టుకు నష్టమేంటి?
ఎగువన నీరు నిల్వ ఉండటం వల్ల ప్రాజెక్టుపై ఒత్తిడి నెలకొంటుంది. ఒకవేళ సరస్సు ఆనకట్ట తెగిపోతే నీరు కింద నిర్మిస్తున్న ప్రాజెక్టు దిశగా ప్రవహిస్తుంది. అదే జరిగితే బ్యారేజీ ధ్వంసమవుతుంది. అంతేకాక ఈ ప్రాంతంలో అధికంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గత శనివారమే(మే 22న) 6.9 తీవ్రతతో యున్నాన్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. భూకంపం ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైంది.
ఇదీ చదవండి- చైనాకు దీటుగా బ్రహ్మపుత్ర నదిపై భారత్ ప్రాజెక్టు!
పద్నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా మార్చి 11న ఈ ప్రాజెక్టుకు చైనా నాయకత్వం ఆమోదముద్ర వేసింది. నదీజలాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రచించుకుంది. మెటోక్(మెడాగ్ లేదా మోటౌ), దాడౌ(దాదుక్వియా) వద్ద రెండు ప్రాజెక్టులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రెండు ప్రాంతాలు భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి.
పద్నాలుగో పంచవర్ష ప్రణాళిక బయటకు రాక ముందే చైనా డ్యామ్‌పై 'ఈటీవీ భారత్' కథనం ప్రచురించింది. బ్రహ్మపుత్ర నదిపై రెండు చోట్ల భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపింది.
ఎంత పెద్దదంటే...
ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో భాగంగా నది ప్రవాహాన్ని సముద్ర మట్టానికి మూడు వేల మీటర్ల ఎత్తులో అడ్డుకొని అక్కడి నుంచి సొరంగాల ద్వారా 850 మీటర్ల కింద మౌటు వద్ద ఉండే టర్బైన్లకు మళ్లిస్తారు. అక్కడి నుంచి దాడౌ వద్ద 560 మీటర్ల ఎత్తులో ఉండే టర్బైన్లకు నీటిని పంపిస్తారు. ఇలా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
38 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా మెటోక్ డ్యామ్ ప్రణాళికలు రచించారు. దాదుక్వియా డ్యామ్ సామర్థ్యం 43,800 మెగా వాట్లు. భూభ్రమణ వేగాన్ని తగ్గిస్తుందని భావించే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ త్రిగోర్జెస్.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,600 మెగా వాట్లు మాత్రమే. దీన్ని బట్టి చైనా ఇప్పుడు చేపడుతున్న భారీ ప్రాజెక్టులు ఎంత పెద్దవో అంచనాకు రావొచ్చు. వీటి నిర్మాణానికి ఆటంకం కలిగితే చైనాకు ఎంత నష్టమో కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి-