అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఫలితాలు వేర్వేరుగా వచ్చి ఉండవచ్చు. కానీ, వీటిలో పార్టీలన్నింటికీ గంపగుత్తగా వర్తించే ఒక గుణపాఠం ఉంది. అదే సమర్థ, స్థానిక నాయకత్వ ఆవశ్యకత! మారుతున్న భారతీయ ఓటరు అభిమతం దృష్ట్యా అధికారం నిలబెట్టుకోవాలన్నా, కొత్తగా సాధించాలన్నా ఈ రెండూ ఎంత అవసరమో తాజా ఎన్నికలు చాటిచెప్పాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని పాలించేవారెవరో, వారి సత్తా ఏమిటో పరిగణనలోకి తీసుకుంటున్నారు ప్రజలు! స్థానికంగా బలమైన నాయకత్వాలను సమర్థ పాలన అందించే వారిని తయారు చేసుకోకుండా దిల్లీ నేతలనో, వారసత్వాన్నో, పార్టీనో, సిద్ధాంతాన్నో చూసి ఓట్లు వేయమంటే ఫలితాలు తిరగబడుతున్నాయి. పశ్చిమ్ బంగలో మమత, కేరళలో విజయన్, అసోమ్‌లో భాజపా నాయకులకు (సోనోవాల్, హిమంత) ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం మిగిలిన పార్టీల్లో ఓటర్లకు కనిపించలేదు. అందుకే వారినే ఎన్నుకున్నారు. తమిళనాట సైతం స్టాలిన్‌కు ఓసారి అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు.
ఇదీ చదవండి: దీదీ అడ్డా పదిలం- భాజపా వ్యూహం విఫలం!
ఇదీ చదవండి: 'మోదీ-షా అజేయులు కారని సుస్పష్టం'
'కాంగ్రెస్ ముక్త్ భారత్'!
'మీ దృష్టిలో కాంగ్రెస్ ముక్త్ అంటే.. దేశంలో అసలు కాంగ్రెసే ఉండొద్దనా?' అని ప్రధానమంత్రి మోదీని ఓసారి అడిగితే- 'కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాలని కాదు. దిల్లీ నాయకత్వాన్ని రుద్దే కాంగ్రెస్ సంస్కృతి పోవాలన్నది నా ఉద్దేశం' అంటూ వివరించారు. యాదృచ్ఛికమో మరేమిటోగాని ఇప్పుడు భాజపా సైతం అదే బాటలో పయనిస్తోంది. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఆ పార్టీ నేతల నోట ఒకటే మంత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ! ఆయన పేరుబలంతో పార్లమెంటు ఎన్నికల్లో భారీగా వస్తున్న ఓట్లను చూసి శాసనసభల ఎన్నికలకూ ఇదే మంత్రం పఠిస్తున్నారు కమలనాథులు. దీన్ని గమనిస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికీ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేరిట ఓట్లడిగిన సంగతి ఎవరికైనా గుర్తుకొస్తే తప్పేమీ లేదు! ఆ కాలపు ఓటర్ల ఆలోచనలకు, ఈనాటి ప్రజల ఆకాంక్షలకు ఓ మౌలిక భేదం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ఒకరకంగా, అసెంబ్లీ ఎన్నికలకు మరోరకంగా ఓటర్లు స్పందిస్తున్నారు. బంగాల్ పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు గణనీయమైన సంఖ్యలో సీట్లిచ్చిన వాళ్లే, అసెంబ్లీకొచ్చేసరికి అంత ఉత్సాహంగా ఆ పార్టీకి మద్దతు పలకలేదు. దిల్లీలోనూ ఇదే జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభతో పాటు ఒడిశా శాసనసభకు ఎన్నికలు జరిగితే, కేంద్రంలో భాజపాను బలపరచిన ఓటర్లు రాష్ట్రంలో నవీన్ పట్నాయక్‌ను గెలిపించారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ విజ్ఞతను రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయా అన్నది ఆసక్తికరం!
ఇవీ చదవండి: ప్రజల తీర్పును స్వాగతిస్తాం: కాంగ్రెస్
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు మళ్లీ నిరాశే- ఇలా ఇంకెంత కాలం?
రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం లేకపోతే ఏమవుతుందో బిహార్ ఎన్నికలే చాటిచెప్పాయి. ఆ రాష్ట్ర శాసనసభలో భాజపాకు అత్యధిక సీట్లున్నప్పటికీ సమర్థుడైన సారథి లేడు! ఫలితంగా ముఖ్యమంత్రి పీఠం చేతిలో ఉన్నా, అధిరోహించలేని అశక్తత! కూటమి ధర్మం పేరిట దాన్ని నీతీశ్‌కుమార్‌కు అప్పగించాల్సి వచ్చింది. స్థానికంగా సమర్థ నాయకత్వాలను తయారు చేసుకోలేకపోవడం భాజపా బలహీనత. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినదించి, ఆ లక్ష్యాన్ని దాదాపుగా సాధించి, రెండు సీట్ల నుంచి అద్వితీయ స్థితికి చేరిన ఆ పార్టీ మునుముందు ఇంకా బలంగా నిలవాలంటే మోదీ మంత్రాన్ని మించి ఎదగాల్సి ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ సంస్కృతికి కొనసాగింపుగా మారే ప్రమాదముంది! బంగాల్ ఎన్నిక నేర్పుతున్న పాఠం ఇదే.
ఇదీ చదవండి: మినీ సార్వత్రికం: ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?
ఇదీ చదవండి: అన్నాడీఎంకేకు అదే శాపంగా మారిందా?
ప్రత్యామ్నాయం కావాలి..
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట జాతీయ పార్టీలకు స్థానం లేదన్నది పాతమాట! సరైన సారథి ఉంటే.. తప్పకుండా ప్రాంతీయాల మధ్యలోంచి జాతీయ పక్షాలు వికసించడానికి అవకాశం ఉంది. ప్రజలను పార్టీలో, సిద్ధాంతాలో ఆకర్షించినా స్థానికంగా సరైన సారథి లేకపోతే మాత్రం ఓట్లు వేయరు. అలాంటి నాయకులను తీర్చిదిద్దుకోలేకపోతే, ఏ పార్టీ అయినా చేసేదేమీ లేదు. ప్రజలకు ఇష్టముండి ఓట్లు, సీట్లు ఇచ్చినా మోదీనో, రాహులో, మరొకరో వచ్చి రాష్ట్రాల్లో పాలన చేయలేరు. కాబట్టి చాలామందికి ఆయా పార్టీలంటే ఇష్టమున్నా ఓటు వేయలేని పరిస్థితిని అవే కల్పిస్తున్నాయి.
భాజపా విషయమే తీసుకుంటే మోదీ ఆకర్షణకు, అమిత్ షా వ్యూహాలకు బలం చేకూరేది స్థానిక సారథ్యంతోనే! అలా కాకుండా గెలిచాక ఎవరో ఒకరిని పెట్టి నడిపిస్తాం అంటే ఈ తరంలో కుదరని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీపై గౌరవమున్నా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయలేదు. కారణం స్థానిక నాయకత్వంపై నమ్మకం లేకపోవడమే! ప్రజలెప్పుడూ సరైన ప్రత్యామ్నాయం కోసమే చూస్తారు. ఆ ప్రత్యామ్నాయం కొన్నిసార్లు విపక్షం కావచ్చు. లేదంటే, అధికారంలో ఉన్నవారే కావచ్చు! కాబట్టి ప్రతి ఎన్నికలోనూ ప్రజలు కోరుకునే ప్రత్యామ్నాయం తామే కావడం ప్రతిపార్టీ అంతిమ లక్ష్యం! ఇప్పుడు బంగాల్‌లో దీదీ, అసోమ్‌లో భాజపా, కేరళలో విజయన్, తమిళనాట స్టాలిన్ చేసింది అదే- ఆ ప్రత్యామ్నాయ పాత్రల్లో వారు సరిగ్గా ఇమిడిపోయారు! విజయం సాధించారు.
కాంగ్రెస్ అయినా, కామ్రేడ్లు అయినా, కమలదళమైనా.. పార్టీ ఏదైనా- స్థానికంగా సమర్థ నాయకత్వాన్ని గుర్తించి, ప్రోత్సహించి, ప్రజల ముందుకు తీసుకురానంత కాలం.. అధికారానికి ఎంత దగ్గరో అంత దూరంగా ఉండిపోతారు!
- రేగళ్ల సంతోష్‌కుమార్
ఇవీ చదవండి: అన్నాడీఎంకేకు అదే శాపంగా మారిందా?