దేశ భౌగోళిక సమగ్రతకే పెనుముప్పు తెచ్చేలా ఇరుగు పొరుగు దేశాలు హద్దుమీరుతున్న తరుణంలో- మొత్తం 42 స్క్వాడ్రన్లలో 12 తరుగుపడి భారత వైమానిక దళం బిత్తరచూపులు చూస్తున్న వేళ ఇది. శత్రువును చెండాడగలిగే సుఖోయ్ ఎంకేఐలు, మిరేజ్ 2000, మిగ్ 27 యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నా, వాటికి సైదోడుగా రాణించాల్సిన జాగ్వార్, మిగ్ 27 బైసన్‌లకు ఆయువు తీరిపోవచ్చింది. కార్గిల్ సమరంలో కీలకపాత్ర పోషించిన ఏడుమిగ్ 25 యుద్ధవిమానాల్ని గత ఏడాది చివర్లో సర్వీస్ నుంచి తొలగించిన వాయుసేన- రఫేల్ లోహ విహంగాల కోసమే నిరీక్షిస్తోంది.
ప్రక్రియ పూర్తయ్యేందుకు 20 ఏళ్లు
భారత వైమానిక దళ పాటవాన్ని ఎంతగానో ఇనుమడింపజేయగల రఫేల్ యుద్ధవిమానాలు, ఇండియా కోరిన సరికొత్త రక్షణ వ్యవస్థలతో పరిపుష్టమై రేపు హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలోకి వచ్చి వాలనున్నాయి. తొలివిడతగా అయిదు, వచ్చే ఏడాదిలో తక్కిన 31 రఫేల్ యుద్ధవిమానాల రాకతో వైమానిక పాటవం గణనీయంగా మెరుగుపడనుందనడంలో సందేహం లేదు. అయినా ఏనాటివి ఈ ప్రతిపాదనలు? కాలంచెల్లిన మిగ్21ల స్థానంలో మధ్యశ్రేణి బహువిధ యుద్ధవిమానాల కోసం 2000 సంవత్సరంలో ప్రతిపాదనలందిస్తే- దాని టెండర్ల ప్రక్రియ 2007లో మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన దసౌ ధరవరలు అతి తక్కువగా ఉన్నాయని 2012లో నిర్ధారించినా, చర్చలు ఓ కొలిక్కి రాకపోబట్టే మోదీ ప్రభుత్వం రూ.59 వేలకోట్లతో 36 యుద్ధవిమానాల కొనుగోలుకు కొత్త ఒప్పందం కుదుర్చుకొంది. దాని మీద రేగిన రాజకీయ రగడ నిరుడు సుప్రీం తీర్పుతో సద్దుమణిగిందిగాని- యుద్ధవిమానాల కొనుగోలుకు 20 ఏళ్లు పట్టడం ఏమిటి? లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో 140 యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం- కొత్త శతాబ్ది సవాళ్లకు దీటుగా రక్షణ రంగ ముఖచిత్రాన్నే మార్చేందుకు పూనుకోవాలి!
దీటు వ్యూహాలు కావాలి..
కృత్రిమ మేధే నయా యుద్ధక్షేత్రాల్ని అనుశాసించనుందంటూ అగ్రరాజ్యాలు ఆ దిశగా సమర వ్యూహాలకు సానపడుతున్నాయి. మానవ రహిత యుద్ధవిమానాల తయారీకి స్కైబోర్గ్ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా- ఉగ్రవాదంకన్నా దేశాల మధ్య వ్యూహాత్మక స్పర్ధే తమకు తీవ్రాందోళనకర అంశమంటూ రెండేళ్లనాడు జాతీయ భద్రతా వ్యూహపత్రాన్ని వెలువరించింది. అణుశక్తితో దూసుకుపోయే అణ్వస్త్ర క్షిపణి వంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని, మున్ముందు వేరేవాళ్లు దాన్ని అభివృద్ధి చేసినా అప్పటికి తాము మరో కొత్త ఆవిష్కరణతో సిద్ధంగా ఉంటామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన మొన్న మార్చిలో సంచలనం సృష్టించింది. అమెరికా అణు ఆయుధాగారం ఆధునికీకరణకు లక్ష కోట్ల డాలర్ల ప్రతిపాదనల్ని అధ్యక్షుడిగా ఒబామాయే ఖరారు చేసిపోయిన నేపథ్యంలో- భూ సముద్ర గగన తలాలే కాదు, అంతరిక్షం అంతర్జాలమూ కొత్త యుద్ధక్షేత్రాలుగా కణకణ మండుతున్నాయి.
సత్వర సంస్కరణలే శరణ్యం
కొన్నేళ్ల క్రితం దాకా 20 లక్షల పైచిలుకు సైన్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా గుర్తింపు పొందిన చైనా- ఇప్పుడు ఇండియా, ఉత్తరకొరియా తరవాత మూడోస్థానంలో ఉందని నిరుటి జపాన్ రక్షణ నివేదిక చాటింది. పదాతిదళాన్ని సగానికి పైగా కుదించి, నౌకా వైమానిక దళాలతోపాటు ఆధునికీకరణపై దృష్టి సారించి చైనా దూసుకుపోతోంది. మరోవంక ఆధునిక సాంకేతికత ఆలంబనగా భారత సైన్యానికీ కొత్త రూపు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి బడ్జెట్ అవరోధాల పాలబడి కుంటుతున్నాయి! నిరుడు చైనా రక్షణ పద్దు 26,100 కోట్ల డాలర్లు, ఇండియా వ్యయీకరించగలిగింది అందులో మూడోవంతు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజన సాధకంగా మలిచే సంస్కరణలు సత్వరం పట్టాలకెక్కాలిప్పుడు!
ఇదీ చూడండి: భారత్ అమ్ములపొదిలో రఫేల్.. శత్రువు గుండె గుభేల్