విషయం అర్థం చేసుకోకుండా బట్టీ పట్టే విషయాలు తాత్కాలికంగా మాత్రమే గుర్తుంటాయి. అలా కాకుండా పాఠ్యాంశాలపై ఆసక్తి పెంచుకుని, అవగాహన చేసుకుని చదివితే మర్చిపోయే ప్రమాదం ఉండదు. విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం. చదివే విషయాలు అర్థమవ్వాలన్నా, ఎక్కువ కాలంపాటు గుర్తుండాలన్నా దీన్ని మించిన సాధనం లేదు. కాబట్టి పాఠ్య పుస్తకాలు చదివేటప్పుడు ఎలాంటి అవాంతరాలూ, అవరోధాలూ లేకుండా చూసుకోవాలి. టీవీ, సెల్‌ఫోన్, శబ్దాలు, కుటుంబ సభ్యుల సంభాషణలు.. ఇలాంటివేమీ మీ దృష్టిని చెదిరేలా చేయకుండా చూసుకోవాలి. నిర్ణీత సమయంపాటు ఏకాగ్రతతో చదివిన పాఠ్యాంశాలు ఎక్కువకాలం గుర్తుంటాయి.
టైమ్ టేబుల్
ఏరోజు ఏయే సజ్జెక్టులను చదవాలనేది స్పష్టంగా టైమ్ టేబుల్ వేసుకోవాలి. దాన్ని కంటికి ఎదురుగా కనిపించేలా గోడకు అంటించుకోవాలి. ఇలా చక్కని ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల ఇప్పటివరకూ ఏం చదివాం, ఇకపై ఏం చదవాలి.. అన్న విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది. ఎలాంటి గందరగోళానికీ ఆస్కారం ఉండదు. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. నిదానంగా, అర్థం చేసుకుంటూ చదివిన విషయాలు ఎక్కువకాలం గుర్తుంటాయి.
చోటు మార్చాలి
సాధారణంగా ఒకే ప్రదేశంలో కూర్చుని చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అప్పుడప్పుడూ ఆ చోటును మారిస్తే బాగా సన్నద్ధత సాధ్యమవుతుంది. సాయంత్రం చదవడానికి కూర్చున్నప్పుడు ఉదయం చదివిన పాఠ్యాంశాలను ఒకసారి మననం చేసుకోవాలి. అలాగే ఉదయం చదవడానికి సిద్ధమైనప్పుడు రాత్రి చదివిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఇలా పునశ్చరణ చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
దృశ్యరూపం
చదివిన అంశాన్ని ఎక్కువ కాలంపాటు గుర్తుపెట్టుకోవాలంటే దృశ్యరూపంలో ఊహించుకోవటం అవసరం. పాఠ్యపుస్తకాల్లోని ఫొటోగ్రాఫ్‌లు, చార్టులు, గ్రాఫ్‌లను శ్రద్ధగా పరిశీలిస్తే వాటిల్లోని అంశాలు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. చదివిన సమాచారాన్ని నోట్ పుస్తకంలో చార్ట్‌లా వేసుకున్నా త్వరగా మర్చిపోలేరు. అలాగే ఒక్కోరకమైన సమాచారాన్ని రాయడానికి ఒక్కోరంగు పెన్ను వాడటం వల్ల ఆయా విషయాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి.
అదనపు సమయం
అర్థం కాని, కఠినమైన విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఏకాగ్రత అవసరం. వీటి కోసం అదనంగా కొంత సమయాన్నీ వెచ్చించాలి. పాఠ్యాంశంలోని అంశాలను వరుసగా ఒక క్రమంలో చదవడానికి ప్రాధాన్యమివ్వాలి. మధ్యలోని, చివరి అంశాలను ముందుగా చదివి, మొదటి అంశాలను చివర చదవడం వల్ల అంతా గందరగోళంగా ఉంటుంది. తార్కికమైన వరుస తప్పడం వల్ల క్రమ పద్ధతిలో నేర్చుకోవాల్సిన అంశాలపై సవ్యమైన అవగాహన లోపిస్తుంది. ఇలా చదివిన విషయాలు గుర్తుండకపోవటంలో ఆశ్చర్యమేమీ ఉండదు..
తగినంత నిద్ర
ఉత్సాహంగా నేర్చుకోవడానికీ, జ్ఞాపకశక్తికీ తగినంత నిద్ర, విశ్రాంతి తోడ్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత కాసేపు కునుకు తీస్తే వేగంగా నేర్చుకోడంతో పాటు బాగా జ్ఞాపకం ఉండే అవకాశం ఉందంటున్నాయి పరిశోధనలు. కాబట్టి పాఠ్యాంశాలు నేర్చుకున్న తర్వాత ఆ రాత్రి బాగా నిద్రపోతే అవి చక్కగా గుర్తుండిపోతాయి!
వ్యాయామంతో శరీరానికే కాదు.. మెదడుకూ లాభాలే!
హడావుడి వద్దు
ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో చదివేయాలని తొందరపడకూడదు. కొంతమంది విద్యార్థులు పరీక్షల ముందు హడావిడిగా ఎక్కువ పాఠాలను చదివేయాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల చదివింది ఎక్కువకాలం గుర్తుండదు. ప్రతిరోజూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి.
కీలక పదం
నిర్ణీత కీలక పదాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్నీ స్ఫురణలోకి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు ‘ఆసియా, ఆఫ్రికాల్లో నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు’ అనే వాక్యం ఉందనుకోండి. ఇక్కడ ఏనుగు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ఈ మాటకు అనుబంధంగా ఉన్న వాక్యం కూడా మీకు వెంటనే గుర్తుకొస్తుంది.
బయటకు చదవాలి
చాలామంది విద్యార్థులు నిశ్శబ్దంగానే చదువుతుంటారు. ఇలా చేయడం వల్ల ఒకోసారి ఇతర ఆలోచనలూ మనసులోకి వస్తుంటాయి. బయటకు చదవడం వల్ల అనవసరమైన ఆలోచనలు ఆగిపోయి, చదివిన అంశం ఎక్కువకాలం పాటు గుర్తుంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ముఖ్యాంశాలు
పాఠంలోని ముఖ్యాంశాలతో సొంతంగా నోట్సు రాసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువుకుంటే పునశ్చరణ సులువుగా, వేగంగా పూర్తవుతుంది. సమయం వృథా కాదు. అలాగే పాఠాలను వాటికి ఉండే సామీప్యత ఆధారంగా విభజించుకుని చదివితే సులువుగా అర్థమవుతాయి. అంతేకాదు ఎక్కువకాలం పాటు గుర్తుంటాయి!
సంధానం
తెలియని విషయాన్ని గురించి చదువుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదివేయకుండా కాస్త సమయం తీసుకోవాలి. దాన్ని అప్పటివరకు తెలిసిన సమాచారంతో అనుసంధానం చేసి విశ్లేషించాలి. కొత్తగా చదివిన అంశాలను పాత జ్ఞాపకాలతో కలిపి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తగా చదివిన విషయాన్ని త్వరగా మర్చిపోలేరు.
వివరించి చెప్పాలి
ఏ విషయమైనా అర్థమైనట్టు ఉన్నా అది ఇతరులకు వివరించి చెప్పగలిగినప్పుడే దానిపై పట్టు వస్తుంది. కొత్తగా నేర్చుకున్న అంశాన్ని స్నేహితులు లేదా సందేహాలున్న తోటి విద్యార్థులకు వివరించి చెప్పాలి. అప్పుడది బాగా అవగాహన అవుతుంది. ఆ అంశంపై మరింత స్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా గుర్తుండిపోతుంది. ఏ రోజు పాఠాలు ఆరోజు కాకుండా అన్నీ ఒకేరోజు హడావిడిగా చదివేస్తుంటారా? ఇలా చేస్తే చదివిన పాఠాలు ఎక్కువకాలం గుర్తుండవు!
ఇదీ చూడండి: వీటితో శరీరానికి శక్తి.. మెదడుకి జ్ఞాపకశక్తి..!