హాయ్..
నా పేరు కోమలి. మాది విశాఖపట్నం. అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నాన్న ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తుంటారు. నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మా అమ్మ మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది. అప్పట్నుంచి నాకు అన్నీ నాన్నే అయి పెంచారు. అమ్మ లేని లోటు తెలియకుండా అల్లారుముద్దుగా చూసుకుంటూ వచ్చారు. బహుశా.. అందుకేనేమో.. ఎంత అల్లరి చేసినా ఒక్క మాట కూడా అన్నది లేదు. మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక స్కూల్లోనే నేను పదో తరగతి వరకు చదువుకున్నా. అదిగో.. అక్కడే కలిసింది నా ప్రియనేస్తం.. లిఖిత. తను ఏడో తరగతిలో మా స్కూల్లో చేరింది. అప్పటి వరకు రాజమండ్రిలో ఉండేవారట! వాళ్ల నాన్నగారు ఒక ప్రమాదంలో చనిపోవడంతో వైజాగ్‌లోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చేశారు.
లిఖిత చాలా అమాయకంగా ఉండేది. అందుకేనేమో.. తొలిచూపులోనే తను నాకు బాగా నచ్చేసింది.. ఎంత అంటే.. కోరి కోరి తనతో స్నేహం చేయాలనిపించేంత! అందుకే నాకు నేనుగా తన దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నా. కానీ తన నుంచి ఎలాంటి స్పందన లేదు. 'కొత్తగా చేరింది కదా.. అంతా కొత్తగా ఫీలవుతోందేమో' అనుకుని నేనంత పట్టించుకోలేదు. స్కూల్లో చేరి పది రోజులు దాటుతున్నా తన వరస అలానే ఉంది. ఎవరితోనూ పూర్తిగా కలవదు. చదువుకోవడం.. పలకరిస్తే నవ్వడం.. అడిగిన దానికి సమాధానం చెప్పడం.. ఇది మాత్రమే లిఖిత చేసే పని. ఇక లాభం లేదని నేనే తనతో స్నేహం చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించేదాన్ని. కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, వాళ్ల ఇంటికి వెళ్లడం.. వంటివి చేసేదాన్ని. అలా ఓసారి లిఖిత ఇంటికి వెళ్లినప్పుడు 'తనకు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం.. ఆయన చనిపోయిన తర్వాత ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు.. ఎందుకు అని అడిగితే.. వాళ్లను ఇష్టపడిన తర్వాత వాళ్లు కూడా నాకు దూరమైతే నేను తట్టుకోలేను' అంటోందంటూ వాళ్లమ్మగారు నాతో చెప్పుకొని బాధపడ్డారు. అప్పటివరకు లిఖితను నేను ఫ్రెండ్‌గానే చూశా. కానీ ఇష్టపడిన వారిని వదులుకోవాల్సి వస్తుందని ఇష్టాన్నే దూరం పెడుతుంటే బాధనిపించింది. అందుకే ఎలాగైనా స్నేహంతో తన బాధని మరిపించాలని అనుకున్నా.
ఇదీచూడండి: Friendship: స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!
ఓసారి లిఖితను మా ఇంటికి తీసుకెళ్లా. నాన్నకు తనను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేశా. ఈలోగా లిఖిత మా అమ్మ కోసం ఇల్లంతా కలియచూస్తుంటే నా గదిలోకి తీసుకెళ్లి అమ్మ ఫొటో చూపించా. నేను కూడా తనలానే బాధపడుతున్నానని లిఖితకు అర్థమైంది. ఆ క్షణం నన్ను గట్టిగా హత్తుకొని నీకు నేనున్నా.. అన్న ధైర్యాన్ని నాకు అందించింది. అప్పట్నుంచి మా స్నేహం ఒక గాఢమైన బంధంగా మారింది. స్కూలు, ఇల్లు.. ఎక్కడైనా ఇద్దరం కలిసి ఉండాల్సిందే! ఏం చేసినా సరే.. కలిసే చేయాలి..! ముచ్చటగా సాగిపోతున్న మా స్నేహబంధం పంచిన మాధుర్యంలోనే ఇద్దరం డిగ్రీ పూర్తి చేసేశాం. ఆ తర్వాతే మొదలైంది అసలు చిక్కు.. ఎంబీఏలో చేరేందుకు ఇద్దరం పరీక్ష రాశాం. నాకు హైదరాబాద్‌లో సీటు వచ్చింది. లిఖితకు బెంగళూరులో వచ్చింది. విడివిడిగా ఉండేందుకు మాకు ఇష్టం లేదు. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో కాలేజీల్లో చేరాల్సి వచ్చింది.
కాలేజీలో చేరిన తర్వాత నెల రోజులు అసలు మనసు మనసులో లేదు.. ఎప్పుడూ లిఖిత జ్ఞాపకాలే! తను కూడా అంతే.. గుర్తొచ్చిన ప్రతిసారీ సమయంతో సంబంధం లేకుండా మెసేజ్ చేయడం, ఫోన్ చేసి మాట్లాడడం వంటివి చేసేది. అలా దూరాన్ని కూడా దగ్గరగా మార్చేసిన లిఖితకు మానసికంగా నాకు తెలియకుండానే దూరం జరిగా. దీనికి కారణం హవీష్. కాలేజీలో నాకు పరిచయమైన వ్యక్తి. క్లాసులు ప్రారంభమైన కొద్దిరోజులకే మా పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారింది.. ఇంకేముంది.. అప్పటివరకు లిఖితకు ఇచ్చిన ప్రాధాన్యం హవీష్‌కు ఇవ్వడం ప్రారంభించా. తను చేసే ఫోన్‌కాల్స్, మెసేజెస్‌కు స్పందించడం కూడా తగ్గించేశా. కాలేజ్ స్టడీస్, తర్వాత హవీష్‌తో కలిసి షికార్లు.. వీటికే ఉన్న సమయం సరిపోయేది కాదు. ఇలాంటి సందర్భంలో కూడా లిఖిత నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. చదువును అశ్రద్ధ చేయొద్దని పదే పదే గుర్తు చేసేది. కానీ ప్రేమ మత్తులో ఆ మాటలు నా చెవికి ఎక్కేవి కావు.
ఇవీచూడండి: TRUE FRIEND: ఎన్ని మాటలు పడినా మీతో దోస్తీ వదలనిది "వాడే.."
ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్త్తెంది. అత్తెసరు మార్కులతో ఎలాగోలా గట్టెక్కేశా. లిఖిత మాత్రం మంచి మార్కులు తెచ్చుకుందని చెప్పడంతో సంతోషించా. తనని కలిసేందుకు హవీష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లా. నన్ను చూడగానే గట్టిగా హత్తుకుంటుందని అనుకున్నా. కానీ పట్టించుకోనట్లుగానే వ్యవహరించింది. దాంతో నాకు కోపం వచ్చి కాస్త గట్టిగా మాట్లాడా. 'కాసేపు నిన్ను పట్టించుకోకపోతేనే ఇంతగా కోపం తెచ్చుకున్నావు.. మరి, నేను, అంకుల్ (మా నాన్న) ఇన్ని రోజులుగా నీకు ఎన్ని మాటలు చెబుతున్నా నువ్వు పట్టించుకోలేదు.. అసలు నీ లక్ష్యం ఏంటి.. ఎటుగా నువ్వు అడుగులు వేస్తున్నావు..' అంటూ తను నన్ను నిలదీస్తుంటే దిమ్మతిరిగిపోయింది. 'నిజమే కదా!' అనిపించింది. వెంటనే తనను క్షమాపణ కోరి తప్పును సరిదిద్దుకుంటా అని మాట ఇచ్చా. దానికి అనుగుణంగానే తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత చదువుపై దృష్టి సారించా. హవీష్‌ను కూడా కెరీర్‌పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించా. తనను లిఖితకు కూడా పరిచయం చేశా. అందుకే మా ఇద్దరితోనూ తను రోజూ మాట్లాడేది. భవిష్యత్తు, ఉద్యోగం, కెరీర్.. మొదలైన వాటి గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన విధానం, వాటిని అమలుచేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ప్రతి విషయం ఒక తల్లిలా/తండ్రిలా మాకు చెప్పేది. అలా తను అందించిన ప్రోత్సాహంతోనే ఎంబీఏ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యాం. అంతేకాదు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ప్రముఖ ఎమ్మెన్సీల్లో ఉద్యోగం కూడా సంపాదించాం. అయితే లిఖిత మాత్రం ఎంబీఏతో పాటు సివిల్స్‌కు కూడా సన్నద్ధమై అందులో విజయం సాధించింది.
'కేవలం మా కెరీర్ విషయంలో మాత్రమే కాదు.. ప్రేమ విషయంలోనూ తనే పెద్దగా వ్యవహరించింది. మా నాన్నని మా పెళ్లికి ఒప్పించింది. అలాగే హవీష్ వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లని కూడా మా ప్రేమను అంగీకరించేలా చేసింది. అలా వయసులో చిన్నదైనా మా పెళ్లికి పెద్దగా వ్యవహరించింది. ప్రస్తుతం మా పెళ్త్లె ఆరేళ్లు కావస్తోంది. మాకు మూడేళ్ల కూతురు కూడా ఉంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా ప్రాణానికి ప్రాణమైన లిఖితే! ఇలాంటి మంచి స్నేహితులు చాలా అరుదుగా మనకు తారసపడుతూ ఉంటారు. వీరిని ఒక్కసారి వదులుకున్నామా?? ఇక మళ్లీ వారి స్నేహం తిరిగి రాదు. అందుకే.. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మా జీవితాలను చక్కదిద్దిన లిఖితకు ధన్యవాదాలు తెలుపుతూ తనలాంటి స్నేహితులనుదేనికోసమైనా సరే.. అస్సలు వదులుకోవద్దని చెప్పడానికే ఇలా మీ ముందుకు వచ్చా. బెంగళూరుకు వెళ్లిన మాకు లిఖిత ఆ రోజు అలా చెప్పి ఉండకపోతే అసలు ఈ రోజు మీ ముందుకు నేనిలా వచ్చేదాన్ని కాదేమో! స్నేహం అంటే అడుగడుగునా మన వెంట ఉండడమే కాదు.. మనల్ని సన్మార్గంలో నడిపించడం కూడా!'
ఇట్లు,
కోమలి.
ఇదీచూడండి: FRIENDSHIP DAY: మీ జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా.?