నేషనల్ ప్రోగ్రాం ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్(ముంబయి), కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా మధ్యవయస్కుల ఆరోగ్యంపై అధ్యయనం చేసింది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి పలు వ్యాధులు నడివయసు వారిని చుట్టుముడుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణలో 2018 జులై నుంచి నవంబరు వరకూ 2,475 మందిని, దేశవ్యాప్తంగా 72,250 మందిని అధ్యయనం చేశారు. సర్వేలో భాగంగా వారికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు అప్పటికప్పుడు వైద్యసిబ్బంది వైద్య పరీక్షలూ నిర్వహించారు.
జీవనశైలి వ్యాధుల ముప్పు 73.4%
* ఎత్తుకు తగ్గ బరువులో అసమానతల కారణంగా పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి, జీవనశైలి వ్యాధుల ముప్పు పొంచిఉన్నవారు 73.4 శాతం
* కంటిచూపు లోపంతో బాధపడుతున్నవారు 33.9 శాతం
* బీపీతో బాధపడుతున్నవారు 31.6 శాతం మంది. తమకు బీపీ ఉందని తెలియకుండా ఉన్నవారు 18.3శాతం. ఉందని తెలిసినా చికిత్సకు నోచుకోని వారు 5.5 శాతం. సరైన చికిత్స పొందని వారు 36.6 శాతం
* అధిక బరువుతో బాధపడుతున్నవారు 24.4 శాతం. బరువు తక్కువగా ఉన్నవారు 16.3 శాతం. స్థూలకాయులు 9.6 శాతం
* 45 ఏళ్లు పైబడిన వారిలో సర్వే చేయడానికి కనీసం ఏడాదికి ముందు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారు 8.1 శాతం మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటులో చికిత్స పొందినవారు 73.6 శాతం మంది.
* చికిత్సకు సర్కారు ఆసుపత్రిలో చేరి ఉచిత సేవలు పొందినప్పటికీ రూ.4,132 ఖర్చుపెట్టాల్సి రాగా, ప్రైవేటులో రూ.35,108 వ్యయమైంది.
* నెలకు తలసరి ఖర్చు గ్రామీణంలో రూ.2,901, పట్టణాల్లో రూ.4,142 కాగా.. మొత్తంగా సగటున రూ.3,379.
* తలసరి ఖర్చులో ఆహారానికి పల్లెల్లో అయ్యే ఖర్చు 52.1 శాతం, పట్టణాల్లో 44.6 శాతం.
* మొత్తం తలసరి ఖర్చులో వైద్యం కోసం పెట్టే ఖర్చు గ్రామీణంలో 17.5 శాతం, పట్టణాల్లో 10.8.
* ఏదో ఒక రకమైన వైద్య బీమా ఉన్నవారు పల్లెల్లో 56.6 శాతం, పట్టణాల్లో 43.3 శాతం.
- ఇదీ చూడండి : శుక్రవారం 15,360 మందికి వ్యాక్సిన్