లక్ష్మీదేవి ఎక్కడుంటుందో తెలిస్తే అక్కడ పూజచేసి ఆ తల్లి అనుగ్రహం పొందటం ఎవరికైనా సులువే. ఓసారి రుక్మిణీదేవికి కూడా ఇదే సందేహం వచ్చిందట. అన్ని సుఖశాంతులకు మూలమైన లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. తన సందేహ నివృత్తికోసం వాళ్ళనీ, వీళ్ళనీ అడగడమెందుకు, సాక్షాత్తు ఆ శ్రీదేవినే అడిగితే సరిపోతుంది కదా అని అనుకుంది. ఓ శుభవేళ అడిగేసింది కూడా. అసలు నువ్వెక్కడ ఉంటావు అని. లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ప్రపంచంలో ఉన్న తన నివాస స్థానాలను వివరించింది.
ఆ తల్లి నివాసమిక్కడే...
సిరుల తల్లి స్థిరంగా కొంత మంది దగ్గర ఉంటుంది. శుభగులు, దక్షులు, కర్మవశులు, శాంతులు, దైవభక్తి కలవారు, జితేంద్రియులు, కృతజ్ఞులు అయిన వారు ఎక్కడవుంటే తాను అక్కడ నివసిస్తానంటుంది లక్ష్మీదేవి. అంటే సమాజంలోని ప్రతి మనిషీ ఈ ఉత్తమ లక్షణాలను అలవాటు చేసుకొని తీరాలి అన్నది లక్ష్మీదేవి మాట. అసూయాపరులు, కోపిష్టివాళ్లు, కర్మభ్రష్టులు, కృతఘ్నులు తనకు గిట్టరని లక్ష్మీదేవి రుక్మిణికి చెప్పింది. అంటే ఈ కూడని లక్షణాలు ఉండే వారి దగ్గర ధనం ఏనాడూ నిలువదన్నది అర్థ్ధం. అలానే ఎంగిలి లేకుండా పాత్రలను పరిశుభ్రంగా ఉంచేవారు, తాము ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారు, ఇతరులను అనవసరంగా విమర్శించనివారి దగ్గరే తానుంటానంటుంది లక్ష్మీదేవి. పొరుగిళ్లకు పోయి కాలం వృథా చేసేవారు, నైతిక విలువలు పాటించని వారు, కలహప్రియులు, గర్వితులు, అత్యాశ కలవారు తనకు గిట్టరని అలాంటి మనస్తత్వం ఉన్నవారి దగ్గర తాను క్షణకాలం పాటు కూడా ఉండబోనని శ్రీదేవి రుక్మిణికి తెలియ జెప్పింది. శుభప్రదమైన వాహనాలు, భూషణాలు, యజ్ఞాలు, పాలు, పూలు, వర్షించే మేఘాలు, వికసించిన పద్మాలు, శరదృతువులోని రాత్రులు, నక్షత్ర వీధులు, ఏనుగులు, పుణ్యతీర్థాలు, గోవులు, వృషభాలు, సింహాసనాలు, సత్ప్రవర్తనతో నడుచుకునేవారు, దేవతారాధకులు ఉండేచోట్లన్నీ తనకిష్టమంది. తాను ఎక్కడా తన స్వశరీరంతో ఉండబోనని, తన స్వభావం చేత మాత్రం తాను ఎవరిలో ఉంటే వారికి భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పింది. సద్గుణాలు కలిగి ఉన్న వారి దగ్గర తానుంటానని లక్ష్మీదేవి చెప్పిన మాటలను గమనిస్తే అవేవో పెద్దగా తపస్సు చేసో, మరింకేదో ఉపదేశం పొందో చేసేవి మాత్రం కావు. చాలా సులభమైనవే.
సిరుల నివాసాలివి...
ఇంటిని, ఒంటిని, మనసును, పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరికీ చేతనైన పనే. అయితే బద్ధకం వదిలించుకోవటం, నీతిని అనుసరించటం అనే వాటిని అలవాటు చేసుకుంటే చాలు లక్ష్మి అలాంటి వారిని వదిలి వెళ్లటమనేది జరగదు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత ఇవి రెండూ ఉంటే సామాజికంగా అంతా సౌఖ్యప్రదమే, సౌభాగ్యదాయకమే అనే ఒక సందేశం లక్ష్మీదేవి మాటల్లో వినిపిస్తుంది. ఆ తల్లి సూచించిన ఉత్తమ స్థాయులకు ప్రతి మనిషి ఎదగగలిగేందుకు కృషి జరగాలి. ఈ తీరుగా ముందుకు సాగితే ప్రతి ఇల్లూ లక్ష్మీదేవి నిలయమే అవుతుంది.
-డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జున రావు
గృహలక్ష్మిని గౌరవిద్దాం...
ఓం శుద్ధలక్ష్మై్య బుద్ధిలక్ష్మి వరలక్ష్మై నమో నమః
నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మై్య నమో నమః
వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మై్య నమో నమః
నమస్తే శృంగారలక్ష్మై్య మహాలక్ష్మై్య నమో నమః
ధనలక్ష్మై్య ధాన్యలక్ష్మై్య ధరాలక్ష్మై్య నమో నమః
నమస్తే అష్టైశ్వర్యలక్ష్మై్య మహాలక్ష్మై్య నమో నమః
అని ఇలా సాగే లక్ష్మీ స్తుతిలో కూడా లక్ష్మీ దేవి ఎన్ని రకాలుగా మనల్ని అడుగడుగునా ఆదుకుంటుందో కనిపిస్తుంది. అలాగే మనకు ప్రత్యక్షంగా కళ్ళెదుట కనిపించే లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన మహిళలు కూడా వారి శక్తినంతా ధార పోసి ఇంటికి దీపాలై కంటికి రెప్పల్లా అందరినీ కాచుకుంటుంటారు. అందుకే వారిని కంటిపాపల్లా కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. దీపాల్లాంటివారే ఇల్లాళ్లు. అందుకే ఇంటికి దీపం ఇల్లాలనే నానుడి ఉంది. అటు లక్ష్మీదేవైనా ఇటు ఇల్లాలైనా తామున్నచోట శాంతి సౌభాగ్యాలను పంచటమే లక్ష్యంగా ఉంటారు. దీపరూపంలో ఉండే లక్ష్మీదేవి ముల్లోకాలలోని చీకట్లను పోగొడితే... ఇంటికిదీపం అయిన ఇల్లాలు కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. పుట్టింటి, మెట్టింటి పరువుతో పాటు సమాజం పరువు, బరువు బాధ్యతలు నేటి ఇల్లాలికి ముల్లోకాలు. ఆ మూడింటినీ చీకటి పాలు కానివ్వకుండా కంటికి రెప్పలా కాచుకుంటుంది.
ఇవీ చూడండి:
- Dry Fruits Sales in diwali: దీపావళి సందర్భంగా డ్రై ఫ్రూట్స్కి పెరిగిన డిమాండ్
- pratidhwani: హరిత బాణసంచాతో కలిగే ప్రయోజనం ఏంటి?
- దీపావళి కోసం స్పెషల్ గోల్డెన్ స్వీట్- కిలో రూ.11వేలు!
- పండగ వేళ ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య
- 'టపాసులు లేకుండానే దీపావళి.. మెజార్టీ ప్రజల ఆలోచన ఇదే!'
- దీపావళి స్పెషల్ స్వీట్ కిలో రూ.25వేలు.. ఎందుకంత ధర?
- eco friendly Diwali: మారుతున్న ఆలోచన.. గ్రీన్ క్రాకర్స్వైపు మొగ్గు