సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్ - 3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారన్న కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి.. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. కొన్ని గంటల తరువాత అనంతపురంలోని వన్‌టౌన్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఏఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇద్దర్నీ సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రెండున్నర గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం మళ్లీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి అరవింద్ నగర్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఎదుట ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిలను హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్ విధించారు. కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కొడుకు అస్మిత్ రెడ్డిని తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులు తీసుకొచ్చారు. అనంతపురం జైలులో ఓ ఖైదీకి కరోనా వైరస్ ఉందని... వారిని కడప జైలుకు తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు