భూ వివాదంలో సొంత తమ్ముడిని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా గాయపరిచాడు అతని అన్న. ఈ దృశ్యాలు నాగర్‌కర్నూలు జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. తూడుకుర్తికి చెందిన తిరుపతయ్య, కురుమయ్య అనే అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం కురుమయ్య కుటుంబసభ్యులతో కలిసి దాడి చేసినట్టు ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు.
ఏప్రిల్ 29న తన పొలంలో దిగబడిన ట్రాక్టర్‌ను తీసేందుకు తిరుపతయ్య అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కురుమయ్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతయ్యపై దాడి చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి పొలంలో ఈడ్చుకుంటూ వెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. ఉరివేసేందుకు ప్రయత్నించగా... చుట్టుపక్కల వాళ్లు చూస్తున్నారని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
తనపై హత్యాయత్నం చేశారని ఏప్రిల్ 30న తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతయ్యను ఉరివేసేందుకే పథకం ప్రకారం దాడి చేసినట్టు దర్యాప్తులో తేలిందని ఎస్సై వెల్లడించారు. కేసులో నిందితులుగా ఉన్న కురుమయ్య, నిరంజన్, అనిల్, శేషమ్మ, అనితను అరెస్టు చేశారు. వీడియో వైరల్ కానంత వరకూ ఈ వివాదాన్ని ఎవరూ పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: గాలికి దూసుకొచ్చి మహిళ ప్రాణాలు తీసిన రేకు