కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సివిల్ ఆస్పత్రిలో మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన భాషబోయిన ప్రవీణ్ యాదవ్ మంగళవారం రాత్రి అపస్మారక స్థితికి చేరుకోవటం వల్ల హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పత్రి ఆర్‌ఎంవో డా.శ్రీకాంత్‌రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.
ప్రవీణ్ అదే ఆస్పత్రిలో కేసీఆర్ కిట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించేవాడని మృతుని భార్య తెలిపింది. ఆస్పత్రిలో గర్భీణీల ప్రసూతి సేవలను సుఖ ప్రసవాలకు మారుస్తూ తప్పుడు నివేదికలను నమోదు చేయాలని సూపరింటెండెంట్ రవీప్రవీణ్‌రెడ్డి ఒత్తిడికి గురి చేశారని ఆరోపించింది. తానూ చేయకపోవటం వల్ల విధుల నుంచి తొలగించి, బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారని తెలిపింది. ఇదే విషయంలో పోలీసులు ప్రవీణ్‌ను కొట్టారని ఆరోపించింది.
ప్రవీణ్ ఉద్యోగ విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆర్డర్ వచ్చినప్పటికీ ఆస్పత్రి సూపరింటెండెంట్ చేర్చుకోలేదని వెల్లడించింది. ఈ విషయమై సూపరింటెండెంట్‌ను బ్రతిమిలాడినా ఏ మాత్రం కనుకరించలేదని తెలిపింది. ఈ విషయమై ఆవేదన చెందిన ప్రవీణ్‌కు గుండెపోటు వచ్చినట్లు వివరించింది. తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు, గ్రామస్థులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.
ప్రవీణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు రంగంలోకి దిగి అప్రమత్తం చేశారు. ప్రవీణ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహనికి శవ పరీక్షను వరంగల్ కేఎంసీ మెడికల్ కళాశాలలో నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. తమకు ఇక్కడే అతని శవపరీక్ష నిర్వహించాలని మృతుని బంధువులు ఆంబులెన్స్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నివేదికల ఆధారంగా కేసు విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య