ఆర్టిసీ బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను ఓ ముఠా టార్గెట్ చేసింది. మాటల్లో పెట్టి ఆవిడను ఏమార్చింది. గుడ్డిగా వారిని నమ్మి, అంతా అయ్యాకా మోసపోయానని గ్రహించిన ఆ మహిళ చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది.
దుండిగల్ జీడిమెట్లకు చెందిన బాలమణి ఓ శుభకార్యం నిమిత్తం దిల్‌సుక్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కింది. అదే సీటులో కుర్చున్న మరో మహిళ.. బాధితురాలితో తన డబ్బులు పడిపోయినట్లు తెలిపింది. అలా ఆ మాయలేడికి సాయం చేసే సమయంలో పథకం ప్రకారం ఆమెతో వచ్చిన ముఠా.. బ్యాగ్లో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. అనంతరం ఆ మరుసటి స్టాప్ లో దిగిపోయింది.
కాసేపటికి.. బ్యాగు తెరిచి ఉండటాన్ని గమనించిన బాధితురాలు నగలు చోరీకి గురయ్యాయని గ్రహించింది. చేసేదేమీ లేక స్థానిక పోలీసులకు సమాచారమిచ్చింది. నిందితురాలితో పాటు మరో ముగ్గురు తన వెంట ఉన్నారని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.