సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లిలో ముగ్గురు సోదరుల కిడ్నాప్ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. హఫీజ్‌పేట భూవివాదంలో వ్యవహారంతోనే బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావు అపహరణ జరిగినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కిడ్నాప్ కేసులో ఏ-1 గా ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ, ఏ-3 భార్గవరామ్‌ను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేశామని వివరించారు.
హఫీజ్‌పేటలో ఇరువర్గాల మధ్య ఏడాదిగా భూవివాదం నడుస్తోందన్న సీపీ .... ఈ వ్యవహారంలో ఎ.వి.సుబ్బారెడ్డిపై గతంలో మియాపూర్ పోలీసుస్టేషన్‌లో ప్రవీణ్‌రావు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ముగ్గురు సోదరుల కిడ్నాప్ జరిగినట్లు వివరించారు. అఖిలప్రియ కుటుంబంతో ముందు నుంచీ ఎ.వి.సుబ్బారెడ్డికి సంబంధాలున్నాయని తెలిపారు. కిడ్నాప్ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందన్న అంజనీకుమార్.... ఏపీ పోలీసుల సాయంతో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
పక్కా పథకం ప్రకారం ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఇంటి నుంచి కిడ్నాప్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఐటీ అధికారుల ముసుగులో నకిలీ ఐడీ కార్డులు చూపి ప్రవీణ్ ఇంట్లోకి చొరబడ్డారన్నారు. అనంతరం ముగ్గురినీ అపహరించారించినట్లు వివరించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి 3 గంటల్లోనే కేసును ఛేదించినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇలాంటి వివాదాలను సహించేది లేదన్న సీపీ అంజనీకుమార్.... కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: అఖిలప్రియ అరెస్ట్.. కాసేపట్లో కోర్టులో హాజరు