రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చంద్రుగూడెంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జంపయ్య చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నాడు. కుమార్తె సరయూ... మూడుచెక్కలపల్లిలోని గిరిజన వసతిగృహంలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. నిన్న సాయంత్రం ఫలితాలు రాగానే చూసుకుంది. ఒక సబ్జెక్టులో తప్పడం వల్ల మనస్తాపానికి గురైంది.
ఒక్క సబ్జెక్టులో పోయినంతమాత్రాన ఏమీ కాదు... మళ్లీ రాసుకోవచ్చని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. ఉదయం లేవగానే బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లింది. సరయూ ఇంత పొద్దున్నే బయటకు ఎందుకు వెళ్లిందని తల్లిదండ్రులు, అన్న గమనించి.. బయటకు వెళ్లి చూస్తుండగా దూరంగా వ్యవసాయ బావి సమీపంలో కనిపించింది. వీరు అక్కడికి వెళ్లే వరకే... బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బంధుమిత్రులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సరయూ ఇంటి నుంచి వెళ్తుండగా... వారి పెంపుడు కుక్క ఆమె వెంటే బావి వద్దకు వెళ్లింది. మృతదేహాన్ని బావిలో నుంచి తీసి.. అక్కడి నుంచి అందరు వెళ్లిపోయినా... ఆ కుక్క మాత్రం అక్కడే ఉండటం మూగజీవానికి ఆ యజమానిపై ఉన్న ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు