గత డిసెంబర్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని నిర్మల, విఘ్నేష్‌లను చంపిన పులి ఒకటేనా? అది ఏ-2 పెద్దపులే అని భావిస్తున్నారు. ఈ రెండు ఘటనల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ చిత్రాల విశ్లేషణ ఆధారంగా ఇదే అంశం స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది. దహెగాం మండలం దిగిడ గ్రామంలో డిసెంబరు 11న విఘ్నేష్, ఆపై 18 రోజులకే పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన నిర్మల పులి పంజాకు బలైన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల్లో 110 కెమెరాలు అమర్చి, పులుల కదలికలు తెలుసుకునేందుకు 60 మంది ట్రాకర్లను ఉపయోగిస్తున్నట్లు అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి 2-3 రోజులకోసారి
ఆ ప్రాంత పెద్దపులుల్లో దాదాపు ప్రతి ఒక్కటీ సగటున ప్రతి 2-3 రోజులకోసారి కెమెరా కంటికి చిక్కింది. ఈ చిత్రాల్ని అటవీశాఖ అధికారులు, ఓ వన్యప్రాణి నిపుణుడితో కూడిన బృందం పరిశీలించింది. ‘ఆరు నెలల క్రితం మహారాష్ట్రలో ఓ పులి మనుషుల్ని వెంటాడింది. ఇక్కడ ఇద్దరిని చంపిన పులి అది కావచ్చని భావిస్తున్నాం.. ఇంకా నిర్ధరించాల్సి ఉంది. మూడు, నాలుగు రోజులకోసారి పులి పశువుల్ని చంపుతోంది’ అని ఓ అధికారి తెలిపారు. క్షేత్రస్థాయిలో తిరిగిన, ఫొటోలు పరిశీలించిన బృంద సభ్యుడొకరు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ‘రెండో ఘటనలో పులి పత్తిచేలోకి వచ్చింది.
కిలోమీటర్ దూరంలో కెమెరాకు చిక్కిన పులి
అక్కడ నిర్మలను చంపడమనేది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. పులి స్పష్టంగా ఆమెపై దాడిచేసింది. దీన్ని బట్టి అది మనిషి రక్తం రుచి మరిగినట్లుగా భావించాలి. మొదటి ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత ఆ ప్రాంతానికి 5 కి.మీ. దూరంలో కెమెరాకు ఓ పులి చిక్కింది. రెండో ఘటనకు ఒకరోజు ముందు ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో కెమెరాకు పులి చిక్కింది. ఈ రెండుచోట్ల కెమెరాకు చిక్కిన పులి ఒకటే. అది ఏ-2గా నిర్ధరణ అయిందని ఆయన ఈటీవీ భారత్’కు తెలిపారు. అటవీశాఖ వర్గాలు మాత్రం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు.
ఇదీ చదవండి: కూలీల కొరతతో వరిసాగు రైతుల ప్రత్యామ్నాయం