సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ల నేరాలకు సంబంధించి మరణశిక్షలను రద్దు చేయాలని ఆ దేశ రాజు సల్మాన్ ఆదేశించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇటీవల సౌదీలో కొరడా దెబ్బలను రద్దు చేశారు. బదులుగా జైలుశిక్ష పొడిగించడం, జరిమానా విధించడం/సమాజ సేవ చేయించడం వంటి శిక్షలను విధించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా మైనర్ల నేరాలకు మరణ శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సౌదీలో గరిష్ఠంగా పదేళ్లు జైలు అనుభవించిన వారి కేసులను ప్రాసిక్యూటర్లు సమీక్షించాలని, వీలైతే వారికి శిక్షలు తగ్గించాలని రాజు ఆదేశించినట్లు తెలిసింది.
పునర్వైభవం దిశగా...
సౌదీ అరేబియాలో ఎవరైనా చిన్న చిన్న నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు అమలుచేస్తుంటారు. అయితే.. మారుతున్న కాలానుగుణంగా చట్టపరమైన నిర్ణయాల్లో కీలక మార్పులకు ఉపక్రమిస్తున్నారు యువరాజు, సల్మాన్ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్.
దేశాన్ని ఆధునికీకరించి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని యువరాజు చూస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సౌదీ ప్రతిష్ఠను పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరుగురికి ఊరట...
సౌదీ రాజు నిర్ణయంతో అక్కడి ఓ మైనార్టీ వర్గంలోని కనీసం ఆరుగురికి మరణ శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. 18 ఏళ్లలోపు వయసున్న వీరిపై.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలున్నాయి.
ఈ దేశంలో గతేడాది ఓ మైనర్‌కు మరణశిక్ష విధించారు. 16 ఏళ్ల వయసున్న అతడు షియాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విమర్శలు నేపథ్యంలో...
ఇటీవలి కాలంలో సౌదీ.. ప్రపంచవ్యాప్తంగా విమర్శల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా టర్కీలో.. సౌదీ రచయిత జమాల్ ఖషోగ్గీ హత్య కేసు పెను సంచలనమే సృష్టించింది. యువరాజు కోసం పనిచేసే ఏజెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇంకా ఉదారవాదులు, మహిళా హక్కుల కార్యకర్తలు, రచయితలు, సంస్కర్తలను అణచివేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
సౌదీలో కనీసం మైనర్లకైనా మరణశిక్షలను రద్దు చేయాలని, కఠిన నిర్ణయాలకు ముగింపు పలకాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ యువరాజు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.