ఇరాన్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి సమీప టర్కీలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించటం వల్ల ఇరు దేశాలపై ప్రభావం అధికంగా ఉన్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. భూకంప లేఖినిపై 5.7తీవ్రత నమోదైంది.
టర్కీ సరిహద్దుకు 10 కిలోమీటర్లు దూరంలో ఇరాన్‌లోని హబాష్-ఎ ఒలియా గ్రామంలో భూకంప కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 9:23 గంటల ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు పేర్కొంది.
టర్కీపై అధిక ప్రభావం...
ఇరాన్, టర్కీ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించటం వల్ల టర్కీలోని సమీప గ్రామాలపై అధిక ప్రభావం పడింది. భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇరాన్‌లోనూ...
ఇరాన్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో 40మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన 17మందిని ఆస్పత్రికి తరలించామని ఆ దేశ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. 43 గ్రామాల్లోని భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఇదీ చూడండి: 78 వేల మందికి కరోనా- ఏ దేశంలో ఎంత మంది?