Thailand Bus Accident : థాయిలాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించారు. మరో 30మందికి పైగా గాయపడ్డారు. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ప్రచౌప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో జరిగింది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ జరిగింది
49 మంది ప్రయాణికులతో కూడిన బస్సు రాజధాని బ్యాంకాక్ నుంచి సోంగాఖ్లా ప్రావిన్స్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే వనకోర్న్ జాతీయ పార్క్‌కు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఫలితంగా 14 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది థాయ్‌కు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. అందుకోసమే సురక్షితంగా బయటపడిన డ్రైవర్‌కు రక్తపరీక్షలు చేశామన్నారు. ఆ ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
సొరంగం కూలి 9 మంది మృతి
Tunnel Collapse In Dominican Republic : సొరంగం సిమెంట్ గోడ కూలి డొమినికన్ రిపబ్లిక్‌లో ఇటీవల 9 మంది మృతిచెందారు. ఈ ఘటన శాంటో డోమింగ్ ప్రాంతంలో జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సొరంగం గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు వేగంగా వెళ్లేందుకు నిర్మించిన ఈ సొరంగం గోడ కూలి... ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కార్లు, ఇతర వాహనాలపై పడింది. అనేక కార్లు లోపలే చిక్కుకుపోవడం వల్ల అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. గోడ కూలడం వల్ల లోపల నిర్మించిన పైప్‌లైన్లు పగిలి సొరంగం నీటితో నిండిపోయింది. ఆ నీటి వల్ల సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. ఇప్పటివరకు 9 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి