Sri Lanka crisis: 'శ్రీలంకలో అస్థిరత ప్రభావం భారత దేశంపై అనేక రకాలుగా ఉంటుంది. అక్కడ సంక్షోభం కారణంగా ఎక్కువమంది లంకవాసులు తమిళనాడులోకి ప్రవేశించే అవకాశం ఉంది. టెర్రరిజం, హింస మళ్లీ తెరపైకి రావచ్చన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటిపై మన భద్రతా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలి' అని శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా, భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన నిరుపమారావు అభిప్రాయపడ్డారు. చైనా రాయబారిగా, అనేక దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసి సుదీర్ఘ అనుభవం కలిగిన ఈమె శ్రీలంక సంక్షోభంపై 'ఈనాడు' ప్రతినిధి ఎంఎల్ నరసింహా రెడ్డికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ చైనా ఇప్పటికే చురుగ్గా ఉందని, మనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శ్రీలంకలో అనూహ్యంగా తలెత్తిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలేంటి ?
శ్రీలంకలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చి.. మార్చి నుంచి రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మకంగా మారాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ సంక్షోభం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కొత్త పరిశ్రమలు, డిజిటల్ సేవల వైపు మళ్లలేదు. మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక దక్షిణాసియాలో అగ్రస్థానంలో ఉన్నా, పర్యాటకం, గల్ఫ్ వెళ్లిన కార్మికుల నుంచి వచ్చే డబ్బు మొదలైన వాటిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఆర్థిక, రాజకీయ అస్థిరత వల్ల టీ, దుస్తుల వంటి ఎగుమతులు ప్రభావితమై.. ఆ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గత కొన్నేళ్లలో ప్రత్యేకించి 2019లో ఈస్టర్ రోజున ఐసిస్ బాంబుదాడులు, తర్వాత కొవిడ్ కల్లోలం.. ఆర్థిక వ్యవస్థను దిగజార్చాయి. పన్నులు తగ్గించడం, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల దిగుమతిపై నిషేధం, ఫలితంగా ఆహారోత్పత్తుల దిగుబడి తగ్గడం వంటి పరిణామాలు వినాశకరంగా మారాయి. శ్రీలంక తన అవసరాలకు తగ్గట్లుగా కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
లంక పరిణామాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుంది?
శ్రీలంక వ్యూహాత్మకంగా మనకు చాలా ముఖ్యమైన దేశం. కాపలాదారు లాగా. నేవిగేషన్, వాణిజ్యపరంగా కూడా. అక్కడి అస్థిరత్వం మనదేశంపై చాలా ప్రభావం చూపుతుంది. తమిళనాడుకు వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇది నేరుగా శ్రీలంకతో సంబంధం ఉన్నదే. లంకలో పరిస్థితి అధ్వానంగా మారితే అనేకమంది శరణార్థులు వస్తారు. ఆహారోత్పత్తుల కొరత వల్ల పేదవర్గాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. దీన్ని మనం విస్మరించకూడదు. ఎల్‌టీటీఈతో సంబంధాలున్న వేర్పాటువాదులు ఇదే అదనుగా, మళ్లీ ఓ గ్రూపుగా ఏర్పడటానికి సమాయత్తమవుతున్నారని ఇటీవల కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే శ్రీలంకలో టెర్రరిజం, హింసావాదం మళ్లీ పెచ్చరిల్లే అవకాశం ఉంది. సింహళీయులు, తమిళజాతుల మధ్య విభేదాలు తీవ్రంగా పెంచి పోషించే ప్రమాదం ఉంది. ఈ పర్యవసానాల గురించి భారత్ ఆలోచించాలి.
శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని చైనా అవకాశంగా తీసుకుంటుందా? ఇప్పటికే శ్రీలంకకు చైనా భారీగా అప్పులిచ్చింది కదా?
శ్రీలంక రాజకీయాలను మనం నిర్దేశించలేం. కానీ అక్కడ ఇప్పటికే చురుగ్గా ఉన్న, ఇంకా ఎక్కువ పట్టు కోసం ప్రయత్నిస్తున్న చైనా లాంటి దేశాల కార్యకలాపాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. శ్రీలంక విదేశీ అప్పుల్లో పదిశాతం చైనావే. చైనా ప్రాజెక్టులు ప్రత్యేకించి హంబన్‌టోటా పోర్టు అభివృద్ధి, మట్టాలా విమానాశ్రయాభివృద్ధి రాజపక్సలకు చాలా ముఖ్యమైనవి. దీనివల్ల ప్రజలకు, ఆర్థికవ్యవస్థకు కలిగిన ప్రయోజనం చాలా స్వల్పం. హంబటాటో పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకివ్వడం శ్రీలంక సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమేనని ఆ దేశ ప్రజలు నిరసనలు తెలిపారు. చైనా పెట్టుబడులు, కొలంబో పోర్టు సిటీ ప్రాజెక్టు యాజమాన్యం విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పలేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. శ్రీలంకకు కలిగే ప్రయోజనాల కంటే చైనా వల్ల దోపిడీయే ఎక్కువ ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ఈ ద్వీపాన్ని పెద్ద ఎత్తున ఆదుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదు?
ప్రధానమంత్రిగా మహీంద రాజపక్స రాజీనామా, కొత్త అధినేతగా రణిల్ విక్రమ సింఘె నియామకానికి అంతర్జాతీయంగా స్వాగతం లభించింది. ప్రత్యేకించి ఇండో ఫసిపిక్ ప్రాంతంలోనూ, అమెరికా, జపాన్ తదితర అనేక దేశాలు ఈ పరిణామాలను సమర్థించాయి. శ్రీలంకలో సుస్థిరత ఉండాలనే ఈ దేశాలు కోరుకుంటున్నాయి. ఆ దేశానికి సాయం అందించడానికి ముందుకొచ్చాయి. ఐక్యరాజ్యసమితి సాయం చేసింది కూడా. ప్రస్తుత సంక్షోభంలో మొదట స్పందించింది భారతదేశం. ఇంధనం, ఆహారం, మందుల కోసం మూడు బిలియన్ డాలర్ల విలువైన సాయం చేసింది. తర్వాత ఆర్‌బీఐ ద్వారా శ్రీలంక సెంట్రల్ బ్యాంకుకు రెండు బిలియన్ డాలర్ల సొమ్మును అందుబాటులో ఉంచింది. ఈ సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని, సాయాన్ని కొనసాగిస్తామని భారత్ చెప్పింది.
మీరు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా, తర్వాత భారత విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు. ఆ దేశంతోనూ, ప్రభుత్వంతోనూ మీ అనుభవాలేంటి?
శ్రీలంక హైకమిషనర్‌గా పనిచేయకముందు 1981-83 వరకు భారత హైకమిషన్ మొదటి సెక్రటరీగా పని చేశాను. శ్రీలంకతో మనకు భౌగోళిక, చారిత్రక, ఆధ్యాత్మిక, జాతుల పరంగా ఎంతో సంబంధం ఉంది. గాంధీజీ అన్నట్లు.. భారతదేశం, శ్రీలంక ఘర్షణ పడటం అసాధ్యం. అంతా ఒక కుటుంబంలాగానే. శ్రీలంకలో ఎప్పుడూ స్థిరత్వం ఉండేలా మనం చూడాలి. ఆ దేశ స్వతంత్రతను, సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను పరిగణనలోకి తీసుకోవాలి. వ్యూహాత్మకంగా శ్రీలంక చాలా ముఖ్యమైంది. భారతదేశం లాంటి పెద్దదేశానికి సరిహద్దుగా ఉంది. ముందుచూపుతో లంకను గౌరవించాలి. దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య మౌలికవసతుల అనుసంధానం శ్రీలంక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతానికి ప్రయోజనకరం.
లంక సంక్షోభం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?
ఆ దేశం అనుసరించిన విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణం. ఇలాంటి పరిస్థితిని మన ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటారన్న విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రాంతీయ సమైక్యతకు ప్రయత్నించాలి. జీడీపీ వృద్ధి, ఆర్థిక పురోగతిని ప్రోత్సహించాలి. సరిహద్దుకు సంబంధించిన విధానాలకు రూపకల్పన చేయాలి. అమలులో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సుపరిపాలన, సామాజిక, ఆర్థికాభివృద్ధికి నియంతృత్వ ధోరణితో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా చర్యలు తీసుకోవాలి. వివిధజాతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం ముఖ్యం. ఇవి జరిగితే పటిష్ఠమైన మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ ఎలాంటి సమస్యా ఉండదు.
ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి లంక ఎలాంటి చర్యలు చేపట్టాలి?
శ్రీలంక ప్రభుత్వం ముందున్న తక్షణ ప్రధాన సవాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవడం. ప్రత్యేకించి పేదవర్గాలు అనుభవించే బాధలను తగ్గించాలి. చెల్లించాల్సిన విదేశీ రుణాల చెల్లింపు విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో జులైలో చెల్లించాల్సిన అప్పు ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలతో కలిసి అప్పుల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం, మందుల దిగుమతికి అప్పు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొత్త ప్రధానిగా సుదీర్ఘ అనుభవం కలిగిన రణిల్ విక్రమ సింఘె నియమితులైనా, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దిగిపోవాలని దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను విస్మరించలేరు. తప్పుడు విధానాలతో గొటబాయ దేశప్రయోజనాలను దెబ్బతీశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాజపక్స కుటుంబం తమ భవిష్యత్తును నాశనం చేసిందని, అవినీతితో దేశాన్ని లూటీ చేసిందని జనం రగిలిపోతున్నారు. అనుభవజ్ఞులు, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే రాజకీయ నాయకులతో బృందాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణకు ఉపక్రమించడం కొత్త ప్రధాని తక్షణ కర్తవ్యం. ఇది కూడా అంత సులభం కాదు. శ్రీలంక ప్రజలు మరికొంతకాలం క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోనున్నారు. సంక్షోభాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేం. వచ్చే అయిదేళ్లు సవాళ్లతో కూడుకున్నది. సరైన పాలన ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు.
ఇదీ చదవండి: 'రష్యా దళాల మందగమనం.. యుద్ధంలో ఉక్రెయిన్‌దే విజయం!'