Libya Floods : ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరంలో సంభవించిన వరదల ధాటికి 2వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ తెలిపారు. వేలాది మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఓ వార్తా సంస్థకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు.
మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో దెర్నా సైతం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు.

Libya Forecast : దెర్నాలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లు స్థానిక మీడియో తెలిపింది. విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

అయితే తూర్పు లిబియా ఆరోగ్యశాఖ మంత్రి ఒత్మాన్ అబ్లుల్ జలీల్ సోమవారం మధ్యాహ్నం ఏఎల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూలో మరణాల సంఖ్యను ప్రకటించారు. 50 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే తాను చెప్పిన మరణాల సంఖ్యలో డెర్నా నగర మృతులను చేర్చలేదని చెప్పారు. షాహత్, ఒమర్ అల్-మొఖ్తర్ పట్టణాల్లో ఏడుగురు మరణించినట్లు వెల్లడించారు.

Libya Flash Flood 2023 : తూర్పు లిబియాలోని బైడాలో 12 మంది చనిపోయారని వైద్యశాఖ ప్రతినిధులు చెప్పారు. మార్జ్ పట్టణంలో వరదల్లో చిక్కుకున్న కారులో ఉన్న వ్యక్తి మరణించినట్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ప్రతినిధి వాలిద్ అల్ అర్ఫీ తెలిపారు. ఈశాన్య లిబియాలోని సుసా పట్టణంలో మరో ఏడుగురు చనిపోయినట్లు అంబులెన్స్ అండ్ ఎమర్జెన్సీ కేంద్రం తెలిపింది.
ఆరు మిలియన్లకుపైగా జనాభా కలిగిన లిబియా.. దశాబ్దానికిపైగా ఘర్షణలతో సతమతమవుతోంది. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతోంది. 2011లో నాటో మద్దతుతో కూడిన తిరుగుబాటు కారణంగా నియంత మొఅమ్‌మర్ గడాఫీ మరణం తర్వాత లిబియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
Brazil Floods 2023 : భారీ వరదలు.. 31 మంది మృతి.. జలదిగ్బంధంలో 60 నగరాలు..
China Flood 2023 : చైనాను ముంచెత్తిన వరదలు.. 29 మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం