Canada PM Divorce : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేసినట్లు కెనడా ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
Canada PM Trudeau Marriage : 2005లో వివాహం చేసుకున్న జస్టిన్ ట్రూడో దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ తాజాగా విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ కలిసే పిల్లల సంరక్షణను చూసుకుంటామని ట్రూడో దంపతులు తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలోని వేరే నివాసంలోకి వెళ్లిపోయారు సోఫీ. పిల్లల్ని చూసుకునేందుకు రిడియా కాటేజికి వస్తుంటానని, అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడూ పిల్లల్ని చూసుకునేందుకు అక్కడే ఉంటానని సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో ప్రకటించారు. ఎప్పటిమాదిరిగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని దంపతులిద్దరూ తెలిపారు. టీవీ వ్యాఖ్యాతగా, మోడల్‌గా సోఫీ గ్రెగొయ్‌రీ సుపరిచితురాలు. ప్రధానిగా పదవిలో ఉంటుండగా భార్యకు విడాకులు ప్రకటించిన రెండో ప్రధానిగా జస్టిన్ ట్రూడో నిలిచారు. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్ ట్రూడో కావడం గమనార్హం.
విడాకులు తీసుకున్న యంగ్ ప్రధాని.. మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు!
Finland PM Sanna Marin Divorce : అతిపిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ డైనమిక్ ప్రధాని సనా మారిన్.. వైవాహిక బంధానికి ఇటీవలే ఆమె ముగింపు పలికారు. భర్త మార్కస్ రైకోనెన్ నుంచి ఆమె విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ మార్కస్ రైకోనెస్‌తో సనా మారిన్ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. వీరి బంధానికి గుర్తుగా ఓ కుమార్తె కూడా జన్మించింది. అయితే సనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020లో వీరిద్దరు వివాహం బంధంతో ఒక్కటయ్యారు.
కాగా 2019 డిసెంబరులో సనా మారిన్ ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. అప్పటికి ఆమె వయసు కేవలం 34 ఏళ్లు. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా ఓ అరుదైన ఘనతను సాధించారు. కొవిడ్ సమయంలో ఎన్నో నూతన విధానాలను అమల్లోకి తెచ్చి ఐరోపా సమాఖ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సనా సంపాదించుకున్నారు. అయితే, ప్రజాధనం వ్యయం, పార్టీల్లో పాల్గొనడం వంటి వ్యవహారాలపై విమర్శలు రావడంతో ఆమె పాపులారిటీ తగ్గిపోయింది. దీంతో మారిన్ రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.