ప్రపంచానికి పెనుసవాలుగా మారిన కరోనా మహమ్మారి కారణంగా ఐరోపా అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6.15 లక్షలు దాటింది. వీటిలో 3,37,632 కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. అన్ని దేశాల్లో కలిపి కరోనా కాటుకు 28వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కేవలం ఐరోపా దేశాల నుంచే 20వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అంటే మొత్తం మృతుల్లో మూడొంతులు ఈ దేశాలకు చెంది వారే.
కరోనా కారణంగా ఐరోపా దేశాల్లో తీవ్రంగా ప్రభావితమైన ఇటలీలో ఇప్పటి వరకు 9,134 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న స్పెయిన్లో 5,690మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రిటన్లో అంతకంతకూ...
బ్రిటన్లో కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. శుక్రవారం ఒక్కరోజే 260మంది మృతిచెందగా మొత్తం మరణాల సంఖ్య వెయ్యి దాటింది. 17,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ ప్రధాని, ఆరోగ్య మంత్రి ఇప్పటికే కరోనా బారిన పడగా, మరో కేబినెట్ మంత్రికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పరీక్షలు ఇంకా చేయలేదని తెలిపారు.
రష్యా సరిహద్దులు మూసివేత
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా శనివారం నుంచి అంతర్జాతీయ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రష్యా తెలిపింది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1200 దాటగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.