Ukraine Crisis 2022: ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశాన్ని ఆక్రమించేందుకే రష్యా పావులు కదుపుతోందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా.. రష్యా ఖండిస్తూ వస్తోంది. తాము యుద్ధానికి దిగే ప్రసక్తే లేదని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో పూర్తిస్థాయి యుద్ధమనే వాదనను తోసిపుచ్చకుండానే.. ప్రస్తుత పరిస్థితులను ఎక్కువ చేసి చూపించడంపై మండిపడ్డారు! ఉక్రెయిన్ మునిగిపోతున్న 'టైటానిక్' కాదని స్పష్టం చేశారు. తమ వీధుల్లో యుద్ధ ట్యాంకులే లేనప్పుడు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భయాందోళనలకు ఆజ్యం పోయడం తగదన్నారు. అలా అని మున్ముందు పరిస్థితులు దిగజారవని చెప్పడం లేదన్నారు.
Ukraine Russia War: ఉక్రెయిన్‌ను భయపెట్టేందుకు, అస్థిరపరిచేందుకు రష్యా యత్నిస్తోందని.. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి సైనిక, రాజకీయ, ఆర్థిక సహకారం కోరుతున్నట్లు జెలెన్ స్కీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాటో కూటమి పైనే భరోసా ఉందన్నారు. ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకరించడం ద్వారా మాతో యుద్ధం కోరుకోవడం లేదని రష్యా నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సైబర్ దాడులు, ఆర్థిక సంక్షోభంతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కు వచ్చేయాలని అమెరికా, బ్రిటన్ ఇటీవల ఆదేశాలు జారీ చేయడం.. తొందరపాటు చర్యేనని విమర్శించారు. ఇదిలా ఉండగా.. 'నాటో' కూటమిలో ఉక్రెయిన్‌ను చేర్చుకోరాదని, తూర్పు ఐరోపా నుంచి అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు వైదొలగాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో చర్చలకూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కిమ్ కవ్వింపు.. ఈసారి శక్తిమంతమైన క్షిపణి ప్రయోగం