బ్రెగ్జిట్ గడువును జూన్ 30 వరకు పెంచాలని కోరుతూ బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఐరోపా సమాఖ్యకు లేఖ రాశారు. ఒప్పందం, దాని ప్రత్యామ్నాయాలకు పార్లమెంటులో ఆమోదం లభించని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం.
ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే మే 23న జరగనున్న ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుంది. అయితే మే 22లోపే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని తన లేఖలో తెలిపారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం మే 22లోగా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. దీనికోసం ఈ నెల 12లోగా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించాలి. ఇలా కానీ పక్షంలో ఎలాంటి ఒప్పందం లేకుండానే నిష్ర్కమించాల్సి ఉంటుంది.
కారణాలివే...
ప్రధానమంత్రి మే నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిపాదిస్తున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు మూడు సార్లు తిరస్కరించింది. దీనికి ప్రత్యామ్నాయాలపైనా కసరత్తు చేశారు. కానీ ఏ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు. ఒప్పందం లేకుండా నిష్ర్కమించటాన్ని ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా గడువు వాయిదాను కోరాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఇటీవలే గడువిచ్చిన ఈయూ..
గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం గత నెల 29నే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సింది. కానీ పార్లమెంటులో బ్రెగ్జిట్‌కు ఆమోదం లభించకపోవడం వల్ల ఇటీవలే గడువు పొడిగింపు కోరింది బ్రిటన్. ఈ నెల 12లోగా పార్లమెంటులో బ్రెగ్జిట్‌ను ఆమెదింపజేసుకోవాలని గడువునిచ్చింది ఈయూ.