బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే నేడు కన్జర్వేటివ్ పార్టీనేతగా రాజీనామా చేయనున్నారు. నూతన ప్రధానిగా మరొకరు నియమితులయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించనున్నారు మే.
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ను వేరుచేసే బ్రెగ్జిట్ బిల్లు పలుమార్లు పార్లమెంట్లో వీగిపోయిన కారణంగా మే పదవిని వీడాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. వీటికి థెరెసా మే తలొగ్గారు.
"బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తీసుకురాలేకపోయానన్న బాధ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది."
-మే 23 నాటి డౌనింగ్ స్ట్రీట్ ప్రసంగంలో మే
"ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లాలని నా తర్వాత వచ్చే వారికి సూచిస్తున్నాను. నేను నమ్మకం చూరగొనలేకపోయిన చోటే వారు విశ్వాసం పొందితేనే పదవిలో విజయం సాధించగలరు. అందరూ ఏకాభిప్రాయానికి వస్తేనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది" అని థెరెసా వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందటం అంత సులభం కాదని తన వ్యాఖ్యల ద్వారా భావి ప్రధానికి సూచించారు మే.
పోటీలో 11 మంది
2016 జూన్లో బ్రెగ్జిట్ రెఫరండం తర్వాత డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా... ఆ బాధ్యతలు స్వీకరించారు మే. ఇప్పుడు 1922 కమిటీకి లేఖ రాయడం ద్వారా తన పదవికి రాజీనామా చేశారు.
బ్రిటన్ ప్రధాని పదవికి 11మంది నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్, మైఖేల్ గోవ్ ముఖ్యనేతలు.
ప్రధాని అభ్యర్థిగా పోటీచేసే వారికి 8 మంది ఎంపీలు మద్దతివ్వాల్సి ఉంటుంది. పార్టీ ఎంపీలు జూన్ 13,18,19,20 తేదీల్లో జరిగే ఎన్నికల్లో తమ నేతను ఎన్నుకోనున్నారు. ఫలితం ఈ నెల 22న వెలువడే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: ఫోర్బ్స్ జాబితాలో ముగ్గురు భారత సంతతి వనితలు