బ్రెజిల్ కార్నివాల్ కోసం రియోడీజెనీరో నగరం సరికొత్తగా ముస్తాబయింది. వేడుకలకు వేలాదిగా ప్రజలు హాజరవుతున్నారు. కొన్నేళ్ల నుంచి సంప్రదాయంగా బ్రెజిలియన్లు జరుపుకునే ఈ కార్నివాల్ మార్చి 1న అట్టహాసంగా ప్రారంభమయింది. మార్చి9 వరకు దాదాపు 10రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి.
రాజధాని నగరమంతా విద్యుద్దీపాలంకరణతో దర్శనమిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యటకులతో కలిసి స్థానికులు వీధుల్లో పార్టీలు చేసుకుంటున్నారు. వేలాదిమంది ఉల్లాసంగా నృత్యం చేస్తూ నిర్వహించే కవాతు కార్నివాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంగీత కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తూ... కార్నివాల్లో పాల్గొన్న వారిని మరింత ఉత్తేజపరుస్తున్నారు.
ఫ్యాషన్ డిజైనర్ల సాయంతో స్థానిక యువతీయువకులు వివిధ రకాల వేషధారణలతో సరికొత్తగా దర్శనమిస్తున్నారు. ఒక్కసారి ఈ వేడుకలో పాల్గొంటే జీవితాంతం గుర్తుండేలా అనుభూతి పొందుతారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
విదేశీ పర్యటకులు ఈ అద్భుత దృశ్యాలను చూడాలంటే 50 నుంచి 120 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సిందే.
" రియో డీ జెనీరోలో జరుగుతున్న ఈ కార్నివాల్ అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్త్రీలకు కావాల్సిన అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయి. పార్టీలు చేసుకునేందుకు కూడా ఇది అనువైన ప్రదేశం. మోడళ్లను ఆకర్షించే విధంగా సారోంగ్ బాల్, కోపాకబానా బాల్, వోగ్ బాల్ వంటి నూతన వస్త్రాలను ఇప్పుడు అమ్ముతున్నాం."
-అమందా టమరోజి, మోడల్