'కశ్మీర్' అంశంపై తొలిసారి పెదవి విప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. ఇది భారత్- పాక్ ద్వైపాక్షిక అంశమేనని ప్రకటించారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యం ఉండకూదని.. కశ్మీర్లో హింసను ప్రేరేపించే విధంగా ఇతర దేశాలు వ్యవహరించకూడదని మెక్రాన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీతో పరస్పర చర్చల అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.
జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మోదీ తనకు వివరించారన్నారు మెక్రాన్. కశ్మీర్ ప్రాంత ప్రజల హక్కులకు భంగం కలుగకుండా చూడాలని భారత ప్రధానిని కోరినట్లు తెలిపారు. 36 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భాగంగా తొలి విమానాన్ని వచ్చే నెలలో భారత్‌కు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
"జమ్ముకశ్మీర్ అంశంపై భారత్-పాక్ ద్వైపాక్షికంగానే చర్చించుకుని పరిష్కారాన్ని కనుగొనాలి. ఇందులో ఇతర దేశాల జోక్యం ఉండకూడదు. ఇదే విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడబోతున్నా."
- ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
స్వార్థపూరిత స్నేహం కాదు..
ఫ్రాన్స్‌తో భారత్‌ది స్వార్థపూరిత స్నేహం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇరు దేశాలు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయన్న మోదీ.. ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తమ మైత్రి మరింత గట్టిపడిందన్నారు.
" భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్నది స్వార్థపూరిత స్నేహం కాదు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో కూడిన గట్టి బంధం ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా భారత్-ఫ్రాన్స్ దేశాల పరస్పర సహకారం మరింత పెరగనుంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు ఫ్రాన్స్ నుంచి బలమైన మద్దతు లభించింది. ఇందుకు అధ్యక్షుడు మెక్రాన్‌కు కృతజ్ఞతలు. భద్రత మరియు ఉగ్రవాద నిర్మూలనపై సహకారాన్ని విస్తృతం చేయాలని మేము నిర్ణయించుకున్నాం."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్తోనూ భేటీ కానున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లోని భారతీయులతో సమావేశమవుతారు.
ఇదీ చూడండి : జాబిల్లి ఫొటోను పంపిన చంద్రయాన్-2