ఫ్రాన్స్ కుబేరుడు, ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఓలివియర్ డసాల్ట్ మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఫ్రాన్స్ నార్మండీలోని కాలావ్డోస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఫ్రెంచ్ మీడియా పేర్కొంది.
శుక్రవారం పారిస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్తో కలిసి కనిపించారు డసాల్ట్. కాగా, ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మేక్రాన్. దేశ సేవలో డసాల్ట్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని కీర్తించారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
69 ఏళ్ల డసాల్ట్ రిపబ్లికన్స్ పార్టీ సభ్యుడు. బిలియనీర్ వ్యాపారవేత్త అయిన సెర్గె డసాల్ట్కు ఈయన పెద్ద కుమారుడు. రఫేల్ యుద్ధవిమానాలు తయారు చేసే డసాల్ట్ ఏవియేషన్ సంస్థ వీరి గ్రూప్ అధీనంలోనే ఉంది. 2002 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తాత మార్సెల్.. ఓ ఏరోనాటికల్ ఇంజినీర్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ దళాలు ఉపయోగించిన విమానాల ప్రొపెల్లర్లను ఆయనే తయారు చేశారు. అక్కడి నుంచి వీరి వ్యాపార సామ్రాజ్యం మొదలైంది.
ఇదీ చదవండి: 'సైబర్ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థ అవసరం'