బల్గేరియా రాజధాని సోఫియాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు ఆ దేశ భద్రతా సిబ్బంది. హైక్వాలిటీ బ్యాంకు నోట్లను ఈ ముఠా ముద్రిస్తోందని అధికారులు గుర్తించారు. ఓ యూనివర్సిటీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ కరెన్సీని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఈ తతంగాన్ని గుర్తించారు బల్గేరియా పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముద్రణా యంత్రాలతో పాటు, ప్రింటింగ్‌కు ఉపయోగించే ఇతర పరికరాలను సీజ్ చేశారు. భారీ స్థాయిలో డాలర్, యూరో కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
"సీజ్ చేసిన కరెన్సీ విలువ భారీగా ఉంది. 4 మిలియన్ డాలర్ల అమెరికా కరెన్సీ, 3.6 మిలియన్ యూరో(సుమారు 4.2 మిలియన్ డాలర్లు) కరెన్సీని మేం స్వాధీనం చేసుకున్నాం. దీన్ని బట్టి చూస్తే క్రిమినల్ కార్యకలాపాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతోంది."
-జార్జీ హాడ్జీవ్, సోఫియా పోలీసు ఉన్నతాధికారి
అరెస్టైన ఇద్దరు నిందితులు భారీ కుట్రలో భాగస్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ డాలర్లను ఉక్రెయిన్‌కు, నకిలీ యూరోలను పశ్చిమ ఐరోపాకు తరలించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: కుప్పకూలిన మిగ్-21 విమానం- పైలట్ మృతి