కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై కార్చిచ్చులా విరుచుకుపడుతోంది. భూభాగమంతా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్నందున.. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి కేసులు 20 లక్షలు దాటాయి. ఇందులో అత్యధికంగా అమెరికాలో 6 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ (1.74 లక్షలు), ఇటలీ (1.62 లక్షలు), ఫ్రాన్స్ (1.43 లక్షలు), జర్మనీ (1.32 లక్షలు), బ్రిటన్ (93,873), చైనా (82,295), ఇరాన్-74,877 కేసులతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కరోనా మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షా 26వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ జాబితాలోనూ 26వేలకు పైగా మరణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇటలీ (21,067), స్పెయిన్(18,255), ఫ్రాన్స్ (15,729), బ్రిటన్ (12,107)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,84,729 మంది కోరనా నుంచి కోలుకున్నారు.
6వేలకు చేరువలో పాకిస్థాన్
పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 151 మందికి వైరస్ పాజిటివ్‌గా వచ్చినందున మొత్తం కరోనా కేసుల 6వేలకు చేరువైంది. పాక్‌లో ఇప్పటివరకు మొత్తం 107 మంది మృతి చెందారు.