చైనాతో సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాక్షిక ఒప్పందాలకు తావులేదని వాషింగ్టన్లో తేల్చిచెప్పారు. అమెరికా-చైనా మధ్య కొద్ది రోజుల్లో మలిదశ వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం చాలా కాలంగా అమెరికా, చైనా ప్రయత్నిస్తున్నా... రెండు దేశాల మధ్య దూరం మాత్రం తగ్గడంలేదు. అమెరికా ప్రస్తావిస్తున్న అంశాలే ప్రధానంగా పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే... తాము పూర్తిస్థాయి ఒప్పందం జరగాలని మాత్రమే కోరుకుంటున్నట్లు వివరించారు ట్రంప్. ఈ ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుందో చెప్పలేమన్నారు.
చైనా మాట...
అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఈనెల 10న వాషింగ్టన్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన హక్కులు, వ్యవసాయం వంటి అంశాలపై సమాలోచనలు జరగనున్నాయి. చైనా బృందానికి ఉప ప్రధాని ల్యూహీ నేతృత్వం వహించనున్నారు.
చైనా పారిశ్రామిక విధానంలో కీలక సంస్కరణలు తీసుకురావాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నా... అందుకు తాము అంగీకరించే పరిస్థితి లేదని ల్యూహీ ఇప్పటికే సంకేతాలిచ్చారు.
ఇదీ చూడండి: రెయిన్ కోట్ రావణ... ఇది దసరా ట్రెండ్ గూరూ!