Ukraine Crisis: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన 24 గంటల్లోనే రాజధాని కీవ్ సమీపంలోకి రష్యన్ సేనలు చేరుకున్నాయి. దీని వెనుక ఆధునిక యుద్ధ తంత్రాలేమీ రష్యా ప్రయోగించలేదు. ఎత్తుకు పైఎత్తులు వేసి ఉక్రెయిన్‌లోకి చొరబడలేదు. సంప్రదాయ యుద్ధ రీతినే అనుసరించింది. సినిమాల్లో చూపించినట్లుగా తొలుత భారీ ఎత్తున సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఆదేశాలు అందగానే దాడులు చేస్తూ క్రమంగా లోపలికి చొచ్చుకెళ్లింది. అయితే, ఇక్కడొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత పశ్చిమ దేశాలపై పైచేయి సాధించేందుకు రష్యా పలుసార్లు విఫలయత్నం చేసింది. కానీ, ఈసారి మాత్రం అలా జరగలేదు. అందుకు ప్రధాన కారణం పుతిన్ ఆస్థానంలో మిలిటరీకి పెరిగిన ప్రాబల్యమే.
పుతిన్ ఆస్థానంలో కీలక విభాగంగా..
దేశ భద్రత విషయంలో పుతిన్ వ్యూహాలను గతంలో ఫెడర్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్సీ) అమలు చేసేది. దీంతో పాశ్చాత్య దేశాల నిఘా నేత్రాలన్నీ దీని కదలికలపైనే ఉండేవి. ఒకప్పుడు పుతిన్ పనిచేసిన కేజీబీనే తర్వాతి కాలంలో ఎఫ్‌ఎస్‌బీగా రూపాంతరం చెందింది. దీంతో ఆ దేశ సైన్యం పరిస్థితి ఆయనకు పూర్తిగా తెలుసు. దీన్ని సమూలంగా మార్చేందుకు గత దశాబ్ద కాలంగా పావులు కదుపుతున్నారు. గతంలో రష్యా విధాన రూపకల్పనల్లో ఆర్మీ పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. కానీ, ఇప్పుడు పొరుగు దేశాలతో సమావేశాలు, విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పైగా ప్రజల్లోనూ ఆర్మీకి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం పుతిన్ ఆస్థానంలో ఓ కీలక విభాగంగా ఆ దేశ సైనిక వ్యవస్థ అవతరించింది.
మార్పునకు ఆద్యుడితడే..
ఈ కీలక మార్పునకు పుతిన్ ఆంతరంగికుల్లో ఒకరు, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుయే ఆద్యుడు. అనేక సంవత్సరాల నుంచి రష్యా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన 2012లో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి పాశ్చాత్య దేశాలు ఆయనపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎఫ్‌ఎస్‌బీ నేతృత్వంలో రష్యా చేసిన యత్నాలకు భిన్నంగా షోయిగు ఆర్మీ పనిచేయడం ప్రారంభించింది. 2014లో క్రిమియాను ఆక్రమించడం, సిరియా వ్యవహారాల్లో జోక్యంలో షోయిగు విజయవంతమయ్యారు.
అప్పట్లో సైన్యానికి ప్రాధాన్యం లేదు..
దాదాపు రెండు శతాబ్దాలు రష్యా సమాజంలో ఆ దేశ సైనికులకు మంచి గౌరవం ఉండేది. కానీ, ఏనాడూ కీలక నిర్ణయాల్లో మాత్రం జోక్యం చేసుకునేది కాదు. సోవియట్ ఏర్పాటైన తొలి సంవత్సరాల్లో ఆర్మీలో పనిచేయడాన్ని అక్కడ గౌరవంగా భావించేవారు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత ఆర్మీపై వచ్చిన దుష్ప్రచారాలు వారి కీర్తిని మసకబార్చాయి. పైగా మాస్కోలోని ప్రభుత్వం మిలిటరీ ఆధిపత్యాన్ని సహించేది కాదు. ఎప్పుడు సైనిక తిరుగుబాటు వస్తుందోనన్న భయంలో ఉండేది. అందుకే కేజీబీకి ప్రాధాన్యాన్ని పెంచి ఆర్మీపై నిఘా ఉంచేది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పుతిన్ కూడా ఇదే పంథాను అనుసరించారు. పుతిన్ అధికారంలోకి వచ్చాక చెచెన్యాపై 1999లో జరిగిన దాడిని ఎఫ్‌ఎస్‌బీనే పర్యవేక్షించింది. అలాగే ఆయనపై వస్తున్న అసంతృప్తిని అణచడానికి, సంపన్నులను నియంత్రణలో ఉంచుకోవడానికీ పుతిన్ దీన్ని వాడుకున్నారు. ఆర్మీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.
ట్రబుల్ షూటర్‌గా..
అఫ్గానిస్థాన్‌లో ఓటమి, చెచెన్యాలో గందరగోళ దాడి, నిర్బంధ సైనిక శిక్షణకు యువకుల విముఖత వంటి పరిణామాలు ఆర్మీ ప్రాధాన్యాన్ని మరింత తగ్గించాయి. పాశ్చాత్య దేశాలు సైతం పుతిన్‌ను అంచనా వేయడం కోసం ఆర్మీని పక్కన పెట్టేశాయి. ఎఫ్‌ఎస్‌బీపై దృష్టి సారించాయి. కానీ, ఎప్పుడైతే షోయిగు రక్షణ శాఖ పగ్గాలు చేపట్టారో పరిస్థితులు మారిపోయాయి. సరిగ్గా సోవియట్ పతనం సమయంలో మాస్కోకు చేరుకున్న ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. ట్రబుల్‌షూటర్‌గా పేరొంది.. అత్యవసర పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ఏర్పాటైన ఓ మంత్రిత్వ శాఖను సమర్థంగా నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి అత్యంత ధైర్యవంతుడిగా గుర్తింపు పొందారు. ఆయనే స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా తన బృందంతో వాలిపోయేవారు. ఇదే ఆయనకు ఇటు నాయకత్వంతో పాటు ప్రజల్లో మంచి ఆదరణను తీసుకొచ్చి పెట్టింది.
అలా ప్రక్షాళన ప్రారంభం..
ఈ క్రమంలో షోయిగు పుతిన్ దృష్టిని ఆకర్షించారు. 1999లో పార్టీలో కీలక నేతగా పుతిన్ ఆయన్ను నియమించారు. దేశమంతా పర్యటించేందుకు అవకాశం ఇచ్చారు. 2012లో రక్షణ మంత్రిని చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్మీపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ.. షోయిగుపై పుతిన్ నమ్మకమే ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్లింది. అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా పూర్తిచేసే షోయిగు ఆర్మీపై క్రమంగా పట్టు సాధించారు. ఆర్మీ అధికారులు కార్యాలయాలకు సూట్‌లు ధరించి రావడాన్ని నిషేధించడంతో ప్రక్షాళనను ప్రారంభించారు. సైనికుడెప్పుడూ యుద్ధక్షేత్రానికి సిద్ధంగా ఉండాలని.. ఆఫీసుల్లో కూర్చోవడానికి కాదని హెచ్చరించడంతో ఆయన ఆదేశాలు ఆరంభమయ్యాయి. తర్వాత ఆర్మీ యూనిఫామ్‌ను 1945 నాటి సోవియట్ సేనల తరహాలో ఉండేలా మార్పులు చేశారు. దాన్ని రష్యా విజయానికి ప్రతీకగా భావిస్తుంటారు! ఆయన కూడా అదే ధరించడం ప్రారంభించారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్టాలిన్ హయాంలో పనిచేసిన గొప్ప ఫీల్డ్ మార్షల్ జార్జి జుకోవ్ తరహాలో కనిపించేవారు. ఇది ఆయనకు ప్రజల్లో మరింత ఆదరణను తీసుకొచ్చి పెట్టింది.
కీలక సంస్కరణలివే..
తనదైన యుద్ధ సంసిద్ధత, మిలిటరీ వ్యూహాలతో క్రెమ్లిన్‌లో షోయిగు స్థానం మరింత ఎత్తుకు చేరింది. మిలిటరీలో సాంకేతికత, నవకల్పనలను ప్రోత్సహించారు. సైబర్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్‌ఫోర్స్, స్పేస్‌ఫోర్స్‌ను విలీనం చేసి రష్యన్ ఏరోస్పేస్ ఫోర్స్‌ను స్థాపించారు. సిబ్బంది వేతనాలను పెంచారు. యువత నిర్బంధ సైనిక శిక్షణ నుంచి తప్పించుకోవడాన్ని దాదాపు అసాధ్యంగా మార్చేశారు.
తొలి వ్యూహాల్లోనే సఫలం..
2014లో క్రిమియాను ఆక్రమించుకోవడంతోనే షోయిగు తొలి విజయం నమోదైంది. రష్యా మద్దతున్న అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌పై వస్తున్న తిరుగుబాటును అణచివేయడంలో ఎఫ్‌ఎస్‌బీ విఫలమైంది. తర్వాత యనుకోవిచ్ దేశం విడిచి వెళ్లిపోయారు. తర్వాత ఆర్మీని రంగంలోకి దింపి షోయిగు విజయం సాధించారు. సిరియాలో 2015, 2019లో మాస్కో అనుకూలుడు బషర్ అల్-అసద్ ప్రభుత్వంపై వచ్చిన తిరుగుబాటునూ షోయిగు ఆర్మీ చల్లబర్చింది. ఈ రెండు సందర్భాల్లో షోయిగుకు విపత్తుల సహాయక బృందాల్లో పనిచేసిన అనుభవం సాయపడింది.
ఒలిగార్క్‌ల అండ..
మరోవైపు షోయిగు నేతృత్వంలో మిలిటరీ సాధిస్తున్న విజయాలు అక్కడి ఒలిగార్క్‌లను సైతం ఆకర్షించింది. దీంతో వారు ఆధునిక ఆయుధాల తయారీకి 'రష్యన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్' ఏర్పాటుకు సహకరించారు. ఈ క్రమంలో రక్షణశాఖకు బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. దీనివల్లే ఒలిగార్క్‌లపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్న వారిని రక్షించేందుకు మాస్కో ప్రభుత్వం వారికి భారీ ఆయుధ తయారీ ఒప్పందాలను అప్పజెబుతోంది.
ఉక్రెయిన్‌పై ఆక్రమణ దిశగా..
గత ఏడాది కాలంగా ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా ప్రణాళికలు రచిస్తోంది. వీటన్నింటిలో షోయిగుదే కీలక పాత్ర. ఈ విషయం రష్యా ప్రతినిధుల మీడియా ప్రకటనలే రుజువు చేస్తున్నాయి. ఎఫ్‌ఎస్‌బీ ప్రతినిధులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంటే.. షోయిగు మాత్రం ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో తమ దృఢనిశ్చయాన్ని తెలియజేసేలా వ్యవహరిస్తున్నారు. లుహాన్స్క్, దోనెట్స్క్‌ను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించే క్రమంలో చేసిన ప్రకటనలు అందుకు నిదర్శనంగా నిలిచాయి. పాశ్చాత్య దేశాల నిఘా నేత్రం, దౌత్యపరమైన ఒత్తిళ్ల మధ్య పుతిన్ వెనక్కి తగ్గుతారని అంతా భావించినా.. షోయిగు నేతృత్వంలోని మిలిటరీ ఇచ్చిన దన్నుతో ఆయన ముందుకే వెళ్లారు.
రష్యా అనగానే చాలా మంది ఆ దేశ యుద్ధ ట్యాంకులు, విమానాలు, ఆయుధాలు, క్షిపణులు, అణ్వస్త్రాలపైనే దృష్టి సారిస్తారు. కానీ, షోయిగు నేతృత్వంలో బలపడిన మిలిటరీని మాత్రం పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. తాజా పరిణామం దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందనే చెప్పాలి. మరోవైపు ఇప్పటి వరకు విజయాలతో దూసుకెళ్తున్న షోయిగు.. నిజమైన యుద్ధం రుచిని చూడనున్నారు. అలాగే సైనిక చర్యల వల్ల కలిగే రాజకీయపరమైన, దౌత్యపరమైన పర్యవసానాలనూ ఎదుర్కోనున్నారు.
ఇవీ చూడండి:
రెచ్చిపోయిన రష్యా.. జనావాసాలపై దాడులు.. 352 మంది మృతి
ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా ఔట్?
'కీవ్' లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు