కాబుల్‌ను ఆదివారం చేజిక్కోవడం ద్వారా అఫ్గానిస్థాన్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు.. రాజధానిలో పహారా కాస్తూ పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని.. ప్రశాంతంగా కనిపించే వీధులకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశారు.
భారీగా ఆయుధాలతో ఉన్న తాలిబన్ ఫైటర్లు కాబుల్ వ్యాప్తంగా గస్తీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో మరోసారి మహిళల హక్కులను కాల రాస్తూ తాలిబన్లు అరాచక పాలన చేయనున్నారనే భయాందోళనలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. వేలాది మంది దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిశ్శబ్దం..
ఇక యూఎస్ రాయబార కార్యలయం నుంచి తమ సిబ్బందిని తరలించేందుకు అమెరికా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కనిపించింది. రాజధానిలో ఉద్రిక్తకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సాయుధులు దొంగతనాలకు పాల్పడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖైదీలను తాలిబన్లు విడిచి పెట్టినట్లు తెలుస్తోంది.
దేశం నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగకముందే తాలిబన్లకు మోకరిల్లాయి అఫ్గాన్ సేనలు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో అఫ్గాన్‌లో పరివర్తనం తీసుకురావాలన్న అమెరికా సహా మిత్ర దేశాల ఉద్యమం ముగిసిపోయింది.
ఇదీ చూడండి: తాలిబన్ల మెరుపు వేగానికి కారణం.. ఈ దళం!