విదేశీ ప్రయోజనాలు కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు శ్రీలంకకు కొత్త రాజ్యాంగం అవసరమని ఆ దేశ ప్రధాని మహింద రాజపక్స అభిప్రాయపడ్డారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఒకరోజు తర్వాత ఆయన ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
రాజపక్స.. ప్రధాన ఎన్నికల హామీ.. 19వ రాజ్యాంగ సవరణ తొలగించటం. ప్రస్తుతం రాజపక్స పార్టీకి వచ్చిన మెజారిటీతో ఈ పని నల్లేరుపై నడక కానుంది. ఈ విషయంపై రాజపక్స స్పందించారు.
"ప్రభుత్వ నిర్వహణను 19వ రాజ్యాంగ సవరణ అసాధ్యం చేసింది. అందుకే గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఈ సవరణ విదేశీయులకు ప్రయోజనం చేకూర్చుతుంది. దేశానికి సరిపోయే కొత్త రాజ్యాంగం ఇప్పుడు శ్రీలంకకు అవసరం. విదేశాల ప్రయోజనాలు కాపాడేది కాదు. వివిధ రంగాల నిపుణులతో విస్తృతంగా చర్చించి ఈ పనిని ముందుకు తీసుకెళతాం."
- మహింద రాజపక్స, శ్రీలంక ప్రధాని
ఏమిటీ 19వ రాజ్యాంగ సవరణ..
పదేళ్ల మహింద పాలన ముగిసిన తర్వాత 2015 ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడిగా గెలిచారు. రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ 19వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: ప్రధానిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టిన మహింద
ఈ సవరణతో ప్రధానితో పాటు పార్లమెంటుకు ఉన్నత అధికారాలు లభించాయి. అధ్యక్ష పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అప్పట్లో విక్రమసింఘే ప్రకటించారు.
అయితే ప్రస్తుత ఎన్నికల్లో సిరిసేన, విక్రమసింఘే దారుణమైన ఓటమిని చవిచూశారు. కేవలం 3 శాతం ఓట్లే సాధించగలిగారు. యూఎన్‌పీ నుంచి విడిపోయిన సాజిత్ ప్రేమదాస స్థాపించిన పార్టీ 54 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
సవరణ రద్దు సాధ్యమేనా?
ఏదేమైనా ప్రధానిగా ఉన్న మహింద.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు తిరిగి అధికారాన్ని బదిలీ చేయాలని కోరుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాజపక్స సోదరుల మధ్య వివాదాలకు తెరలేపి పాలనను అస్థిరపరిచే ప్రమాదం ఉందని సందేహాలు వినిపిస్తున్నాయి.
5 సీట్లు తక్కువగా..
గొటబాయ అధ్యక్షుడిగా గెలిచిన 9 నెలల తర్వాత కరోనా భయాల మధ్య గత వారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు రాజపక్స. 225 స్థానాల్లో 145 సీట్లను కైవసం చేసుకున్నారు. కొలంబోలోని కేలానియా బౌద్ధ దేవాలయంలో గొటబాయ సమక్షంలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. రాజ్యాంగ సవరణకు 150 సీట్ల మెజారిటీ కావాల్సి ఉండగా రాజపక్స పార్టీకి ఐదుగురు సభ్యులు తక్కువగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో రాజపక్స జయభేరి- 145 సీట్లు కైవసం
ఈసీటీపై ఇలా..
కొలంబో నౌకాశ్రయంలో భారత్, జపాన్ భాగస్వామ్యంతో నిర్మిస్తోన్న ఈస్టర్న్ కంటైనర్ టెర్మినల్ (ఈసీటీ)పై ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు రాజపక్స. కేబినెట్‌తో చర్చించకముందే దీనిపై మాట్లాడటం సముచితం కాదని పేర్కొన్నారు.
(రచయిత- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)
ఇదీ చూడండి: శ్రీలంకతో స్నేహబంధం కావాలి దృఢతరం