నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు కేబుల్ ఆపరేటర్లు. దూరదర్శన్ ప్రసారాలను మాత్రం కొనసాగిస్తున్నట్లు నేపాల్ కేబుల్ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇందుకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
భారత్కు చెందిన వార్తా ఛానల్స్ ఓలి శర్మకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వాటిని నిషేధించాలని ఆ దేశ ఉపప్రధాని నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయమే ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు భారత్కు చెందిన టీవీ ప్రసారాలను నిషేధించినట్లు తెలిస్తోంది.
స్వచ్ఛందానే..
కేబుల్ ఆపరేటర్లు మాత్రం తామే స్వచ్ఛందంగా ప్రసారాలను ఆపేశామని ప్రకటించారు. ఈ విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్ తన స్పందనను ఇంకా తెలియజేయలేదు.
కొత్త అనుమానాలు..
కొన్ని రోజులుగా భారత్, నేపాల్ మధ్య సరిహద్దు విభేదాలు రాజుకొంటున్నాయి. భారత్లోని కొన్ని భూభాగాలను తనవిగా పేర్కొంటూ కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది నేపాల్. అంతేకాకుండా భారత్కు వ్యతిరేకంగా ఓలి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఓలి భవితవ్వంపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.