ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యలో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్ చనిపోయారు. ఈ విషయాన్ని కీవ్‌లోని పోలీసు అధికారి ఆండ్రియా కోబిటోవ్ వెల్లిడించారు. రష్యా దళాలు ఇర్పిన్ నగరంలో జరిపిన కాల్పుల్లో జర్నలిస్ట్ చనిపోయినట్లు పేర్కొన్నారు.
మృతుడిని బ్రెంట్ రెనాడ్‌గా గుర్తించారు అధికారులు. ఈ మేరకు అతని మృతదేహాంతో పాటు సంస్థ గుర్తింపు కార్డు, అమెరికా పాస్‌పోర్ట్‌ను మీడియాకు చూపించారు. అయితే, మొదట అతను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వార్త సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ ఉద్యోగిగా భావించారు. కానీ, ప్రస్తుతం బ్రెంట్ తమ సంస్థలో పని చేయడం లేదని న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు చాలా ఏళ్ల క్రితం జారీ చేసిందని స్పష్టం చేసింది.
చనిపోయిన వ్యక్తి ఇప్పటికే పాత్రికేయ రంగంలో పలు గొప్ప అవార్డులు అందుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు.
జర్నలిస్ట్ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి.