మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ప్రజలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మండలయ్ నగరంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇంత మంది ప్రాణాలు కోల్పోవటం ఇదే తొలిసారి. మింగ్యాన్ నగరంలో ఆందోళన కారులను చెదరగొట్టాడానికి పోలీసులు బాష్ప వాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రతిరోజు ప్రజలు నిరసన చేపడుతున్నారు. పోలీసులు వారిపై తమ జులుంను ప్రదర్శిస్తూనే ఉన్నారు. గత ఆదివారం పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణలో 18మంది మృతి చెందినట్లు ఐరాస మానవ హక్కలు కమిషన్ అంచనా వేసింది.
సైనిక తిరుగుబాటు
మయన్మార్ పార్లమెంట్‌కు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు నేపిడాలో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తూ ఆ దేశం సైన్యం ఆంగ్‌సాన్ సూకీ సహా ఇతర కీలక నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం చేసింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని మయన్మార్ సైన్యం వెల్లడించింది.
దీంతో ఆగ్రహించిన ప్రజలు సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మయన్మార్‌లో ఆగని పౌర నిరసనలు