నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను జనవరి 18లోపు అరెస్టు చేయాలని పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు అక్కడి పోలీసులను ఆదేశించింది. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నాడన్న కేసులో అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిప్రకారం అజార్‌ను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపర్చాల్సిందిగా పంజాబ్ పోలీసుకు చెందిన కౌంటర్ టెర్రరిజం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఒకవేళ కోర్టు ముందు హాజరు కావడంలో మసూద్ విఫలమైతే ఉద్దేశపూర్వక అపరాధిగా ప్రకటించనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. మసూద్ అజార్‌పై ఉగ్రవాదులకు నిధులు అందజేయడం సహా, జిహాదీ సాహిత్యాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులకు నిధుల సరఫరా అంశంపై పాక్‌లోని పంజాబ్ పోలీసులు దృష్టిసారించారు. నిధుల సరఫరాపై ఉక్కుపాదం మోపుతూ.. ఆరుగురు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు.