కరోనాను దృఢ సంకల్పంతో జయించి.. ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న న్యూజిలాండ్.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముస్తాబవుతోంది. దేశ ప్రజలు.. శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత ప్రధాని జసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లిబరల్ లేబర్ పార్టీతో కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి చెందిన కాలిన్స్ బృందం పోటీపడనుంది. అయితే జసిండా ఆర్డెర్న్.. మరోమారు ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనాపై పోరులో..
2019లో క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనను ఎదుర్కొన్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జసిండా. అయితే కరోనాపై పోరులో తన నాయకత్వంతో అందరినీ కట్టిపడేశారు జసిండా. ఇదే ఆమెకు అత్యంత సానుకూల అంశమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై జసిండా ప్రణాళికలు.. ఓటర్లను ఆకర్షిస్తాయని లేబర్ పార్టీ విశ్వాసంతో ఉంది.
గంజాయి.. కారుణ్య మరణం..
సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో రెండు కీలక విషయాలపై న్యూజిలాండ్ వాసులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. గంజాయి, కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం)పై ఓటు వేయనున్నారు. కారుణ్యమరణానికి మద్దతు లభిస్తే.. అది వెంటనే చట్టంగా మారుతుంది. గంజాయిని చట్టబద్ధం చేయడానికి న్యూజిలాండ్ వాసులు మద్దతునిచ్చినా.. అనంతరం ఆ దేశ పార్లమెంట్లో అందుకు తగ్గ చట్టాన్ని ఆమోదించాల్సిందే.
ఇదీ చూడండి:- అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని