నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోకుండా ఆపడానికి, నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈక్రమంలో మరోసారి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నత స్థాయి అధికారులు. ఈ సమావేశంలో నేపాల్‌లోని రాజకీయ సంక్షోభంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌లో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆదివారం నేపాల్ చేరుకున్న చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్ గువో యెజౌ నేతృత్వంలోని బృందం.. పుష్ప కుమార్ దహల్ ప్రచండతో భేటీ అయ్యింది. అనంతరం మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్‌ను కలిసింది.
గువో బృందం.. అధ్యక్షుడు విద్యా దేవి భండారి, ప్రధానమంత్రి ఓలిలతో ఆదివారం వేర్వేరుగా భేటీ అయినట్లు మై రిపబ్లికా వార్తా పత్రిక పేర్కొంది. ఈ విషయాన్ని ఆయా కార్యాలయాలు ధ్రువీకరించాయి. అయితే సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేదని వార్తా పత్రిక తెలిపింది.
నేపాల్‌లోని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ) అగ్రనేతలతో కూడా గువో బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. పార్లమెంటు రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ఎన్సీ.. ప్రజాప్రతినిధుల సభను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: నేపాల్ రాజకీయాల్లో మరోసారి చైనా జోక్యం!