మయన్మార్ నుంచి తప్పించుకుని వచ్చి మిజోరంలో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను వెంటనే అప్పగించాలని ఆ దేశం కోరింది. ఈ మేరకు చాంపాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు మయన్మార్ అధికారి లేఖ రాశారు. మయన్మార్‌తో 510 కి.మీ.ల మేర మిజోరామ్‌కు సరిహద్దు ఉంది. ఇటీవల ఆ 8 మంది తమ దేశం నుంచి పారిపోయి వచ్చారని, వారిని నిర్బంధించి తమకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా.. శుక్రవారం మయన్మార్ నుంచి 16 మంది వచ్చారని, వారిలో 11 మంది తాము పోలీసులమని చెప్పినట్లు మిజోరామ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తం పరిస్థితిని కేంద్ర హోం శాఖకు నివేదించామని.. అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు.