Myanmar Landslides: మయన్మార్ కాచిన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. హాపాకంత్ ప్రాంతంలోని జేడ్(పచ్చరాయి) మైన్‌లో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా పేర్కొంది.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దుకాణాలు సైతం ఇందులో కూరుకుపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఆ గనుల్లో తరచు కొండచరియలు విరిగిపడుతుంటాయి. గతేడాది జులై నెలలో జరిగిన ఇటువంటి ఘటనలోనే 174 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మైన్..
ప్రపంచంలోనే భారీ, అత్యంత లాభదాయకమైన గనిగా.. జేడ్ మైన్ పేరొందింది. ఇది దేశంలోని అతి పెద్ద నగరమైన యూంగోన్కు సుమారు 950 కిలోమీటర్ల (600 మైళ్లు) దూరంలో ఉంది. ఇక్కడి కార్మికులంతా ఎలాంటి ఒప్పందం లేకుండా సాధారణ కూలీలుగానే పనిచేస్తూ.. అక్కడే ఉన్న మట్టిదిబ్బల వద్ద జీవనం సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: పారాగ్లైడర్‌ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి