పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం లండన్‌కు వెళ్లనున్నారు. షరీఫ్ లండన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆయన కుటుంబం చేసిన అభ్యర్థనకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య భారీగా తగ్గడం వల్ల నవాజ్ షరీఫ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్లేట్లెట్ల సంఖ్య 2 వేలకు పడిపోవడం వల్ల అక్టోబర్ 22న ఆయనను కస్టడీ నుంచి ఆస్పత్రికి తరలించింది పాక్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ. రెండు వారాల చికిత్స అనంతరం తిరిగి ఆయన నివాసానికి తరలించింది.
విదేశీ ప్రయాణాలపై నిషేధిత జాబితా అయిన ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్(ఈసీఎల్)లో షరిఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియం పేరు ఉంది. ఈ జాబితాలో తన పేరు ఉన్నందున తండ్రితో కలిసి లండన్ వెళ్లేందుకు వీలుకాదని తెలిపారు మరియం. తన తండ్రి పేరును జాబితా నుంచి తొలగిస్తే ఈ వారంలో లండన్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
చికిత్సకు అభ్యంతరం లేదు
చికిత్స కోసం షరీఫ్ విదేశాలకు వెళ్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ దేశ ప్రధాని ప్రత్యేక సహాయకుడు నయీముల్ హక్ తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షరీఫ్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.