ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశానికి ఏకఛత్రాధిపతి కిమ్ జోంగ్ ఉన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ కిమ్ చనిపోతే.. ఆయన సోదరి కిమ్ యో జోంగ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నట్లు కథనాలూ వెలువడుతున్నాయి. అయితే ఇవి ఎంత వరకు నిజమనే దానిలో స్పష్టత లేదు గానీ ప్రస్తుతం కిమ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. ఈ నేపథ్యంలో కిమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
పుట్టిన సంవత్సరంపై సందేహాలు
కిమ్ జోంగ్ ఉన్ పుట్టింది 1982 జనవరి 8 అని అధికారంగా చెబుతారు. కానీ, దక్షిణ కొరియా రికార్డుల ప్రకారం కిమ్ పుట్టింది 1983 జనవరి 8 అని, అమెరికా రికార్డుల ప్రకారం 1984 జనవరి 8 అని ఉంటుంది. అయితే కిమ్ ఏ ఏడాదిలో జన్మించారనే విషయం ఎవరికీ తెలియదు. అధికారం చేపట్టడానికి, పెద్దమనిషిగా కనిపించడానికి 1982ని ఆయన పుట్టిన సంవత్సరంగా చూపిస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట.
అనామకుడిగా విద్యాభ్యాసం
స్విట్జర్లాండ్‌లో కిమ్ చదువుకున్నాడన్న విషయం చాలా మందికి తెలుసు. 1993-1998 మధ్య అక్కడి ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కిమ్ విద్యనభ్యసించాడు. అయితే స్కూల్‌లో అతడి పేరును ఎక్కడా కిమ్‌గా చెప్పలేదు. ‘పాక్-కోల్’ అనే పేరుతో చదువుకున్నాడట. ఆ తర్వాత 1998-2000 మధ్య బెర్న్‌లోని ఓ స్కూల్‌లో అతడి విద్యాభ్యాసం జరిగింది. అయితే ఆ పాఠశాల రిజిస్టర్‌లో కిమ్ పేరును ‘పాక్- ఉన్’గా మార్చారు. నార్త్ కొరియా ఎంబసీలో పనిచేసే ఓ ఉద్యోగి కుమారుడిగా కిమ్‌ను స్కూల్‌లో పరిచయం చేశారు.
చదువు అంతంత మాత్రమే.. కానీ రెండు డిగ్రీలు
పాఠశాల విద్య సమయంలో కిమ్ చదువులో చాలా వెనకబడి ఉండేవారట. బాస్కెట్‌బాల్, వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతూ సమయం గడిపేవారట. అయినా కిమ్ రెండు డిగ్రీలు పొందారు. స్వదేశంలోని కిమ్ 2-సంగ్ యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో ఒక డిగ్రీ, మలేషియాలోని హెల్ప్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఒక డిగ్రీ పట్టా అందుకున్నారు.
తాతలా కనిపించాలని..
చాలా మంది యువకుడిగా కనిపించాలని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. కానీ 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కిమ్ అతడి తాత (కిమ్ ఇల్ సంగ్)లా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
జున్నుపై ఇష్టం.. అందుకే కిమ్ అలా..
జున్ను అంటే కిమ్‌కు అమితమైన ఇష్టం. స్విట్జర్లాండ్‌లో చదువుకునే సమయంలో ఆయనకు జున్ను తినడం అలవాటైందట. దీంతో ఆయన ఆహారంలో జున్ను తప్పనిసరి అయిపోయింది. ఎంతలా అంటే.. కేవలం ఆయన కోసం విదేశాల జున్ను దిగుమతి చేసుకుంటారట. అలా జున్ను తినీ తినీ కిమ్ అంత లావైపోయారని అక్కడివాళ్లు చెప్పుకుంటారు.
శిక్షణ లేదు.. కానీ ఆర్మీ చీఫ్
సైన్యంలో సాధారణ సైనికుడికి కూడా కఠోర శిక్షణ ఉంటుంది. కానీ ఏ శిక్షణ, అనుభవం లేకుండానే కిమ్ ఉత్తర కొరియా డయిజాంగ్‌గా వ్యవహరిస్తున్నారు. డయిజాంగ్ అనేది ఉత్తరకొరియా ఆర్మీలో అత్యున్నత పదవి.
కిమ్ కనుబొమ్మలు కనుమరుగవుతున్నాయ్
గత కొన్నాళ్ల నుంచి కిమ్ ఫొటోలు చూస్తే.. విచిత్రమైన విషయం బయటపడింది. కిమ్ కనుబొమ్మల పరిమాణం తగ్గుతూ వస్తోంది. అయితే కొందరు కిమ్, తన తండ్రి (కిమ్ జోంగ్-ఇల్)లా కనిపించడం కోసం కొనుబొమ్మలు కత్తిరిస్తున్నారని.. అలా కత్తిరిస్తుండటం వల్ల కనుబొమ్మలు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు.
కిమ్‌కు ఎన్నో బిరుదులు..
ఉత్తర కొరియా అధ్యక్షుడిగా, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అధినేతగా ఉన్న కిమ్‌కు కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే.. ‘ది న్యూ స్టార్ట్’.. ‘‘ది బ్రిలియంట్ కామ్రేడ్’’.. ‘‘ది జీనియస్ ఎమాంగ్ అదర్స్’’.. ‘‘ది మార్షల్ ఆఫ్ నార్త్ కొరియా’’.
బాస్కెట్‌బాల్ అంటే ఇష్టం
స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడే కిమ్‌కు బాస్కెట్‌బాల్ ఆటపై ఆసక్తి, ఇష్టం ఏర్పడ్డాయి. ఇప్పటికీ కిమ్‌కు బాస్కెట్‌బాల్ క్రీడంటే ఎంతో ఇష్టం. అందులోనూ మైఖేల్ జోర్డాన్‌కు కిమ్ వీరాభిమాని. అందుకే అతడిని స్నేహితుడిగా మార్చేసుకున్నాడు. కిమ్ కోసం జోర్డాన్ చాలాసార్లు ఉత్తరకొరియాకు వెళ్లాడు.
నిర్దాక్షిణ్యంగా మరణశిక్షలు?
చిన్న చిన్న తప్పులకే ఘోర శిక్షలు విధించే కిమ్.. చాలా మందికి నిర్దాక్షిణ్యంగా మరణశిక్షలు విధించాడు. తన అభద్రత భావంతో సొంత కుటుంబ సభ్యులను, బంధువులను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ చంపించాడని ఆరోపణలు ఉన్నాయి.